‘ఆంధ్ర మల్య’ బాండ్ల గేమ్‌

‘ఆంధ్ర మల్య’   బాండ్ల గేమ్‌

న్యూఢిల్లీ : బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలుగు ప్రజలందరికీ సుపరిచితులే. ఆయన 2019లో టీడీపీకి రాజీనామా చేసి కమలదళంలో చేరారు. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి అంతకుముందే ఐటీ శాఖ ఆయనపై ఆరోపణలు మోపింది. రమేష్తో పాటు మరో ముగ్గురు పార్టీ ఎంపీలు పార్టీని వీడడంతో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన కొద్ది వారాలకే వీరంతా టీడీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఫిరాయింపులు జరిగాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మౌలిక సదుపాయాల సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రమేష్ వ్యవస్థాపకులు. ఈ కంపెనీ వ్యవహారాలు, కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్లపై స్వతంత్ర మీడియా సంస్థలు న్యూస్లాండ్రీ, స్క్రోల్, ది న్యూస్ మినిట్తో పాటు పలువురు స్వతంత్ర పాత్రికేయులు ఓ నివేదికను రూపొందించారు. దాని ప్రకారం గత సంవత్సరం రుత్విక్ ప్రాజెక్ట్స్ ఐదు కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. దానికి రెండు వారాల ముందు ఆ కంపెనీకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ కాంట్రాక్ట్ లభించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ పాలనలో జనవరి 14న ఈ ఎల్ఓసీ వచ్చింది. 2023 మార్చి 23న ప్రభుత్వ రంగంలోని స్వచ్ఛ ఇంధన సంస్థ ఎస్వీజేఎన్ లిమిటెడ్ ఇదే ప్రాజెక్టుకు రూ.1,098 కోట్ల కాంట్రాక్ట్ ఒప్పందంపై సంతకాలు చేసింది. మూడు వారాల తర్వాత రిత్విక్ ప్రాజెక్ట్స్ మళ్లీ రూ.40 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మైనింగ్, నీటి పారుదల నుండి హైవేలు, మౌలిక సదుపాయాల వరకూ అనేక రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాశ్మీర్ వలసవాదుల కోసం మినీ టౌన్షిప్, పాలేరు ఎర్త్ డ్యామ్ వంటి ప్రాజెక్టులను కూడా ఈ కంపెనీ చేపట్టింది. 2012 నుండి రిత్విక్ వ్యవహారాలతో తనకేమీ సంబంధం లేదని రమేష్ చెబుతున్నారు. అయితే ఆయన సోదరుడు ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా, రమేష్ కుమారుడు ఆపరేషన్స్ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీ జాడ లేని లావాదేవీల ద్వారా రూ.74 కోట్లు, అనుమానాస్పద బిల్లులతో రూ.25 కోట్లు దారి మళ్లించిందని ఆదాయపన్ను శాఖ 2018లో ఆరోపించింది. ఆ శాఖ అధికారులు హైదరాబాద్, కడపలోని రమేష్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రమేష్ బీజేపీలో చేరడానికి కొద్ది నెలల ముందు ఆ పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి ఓ లేఖ రాశారు. ఆదాయపన్ను అధికారులు చేసిన ఆరోపణలకు సంబంధించి రమేష్పై విచారణ జరపాలని కోరారు. అంతేకాదు…రమేష్ను ‘ఆంధ్ర మాల్యా’గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ 2018లో ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్డీఏ ద్వారాలు శాశ్వతంగా మూసేశామని 2019లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అయితే ఈ నెల ప్రారంభంలో చంద్రబాబు ఎన్డీఏ గూటికి చేరిపోయారు. ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఎన్డీఏలో చేరామని ఆయన సమర్ధించుకున్నారు. కాగా రమేష్ ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం వచ్చే నెలలో ముగుస్తుంది. ఆయనపై ఐటీ శాఖ పెట్టిన కేసు ఇప్పటికీ పెండింగులోనే ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన అత్యధిక సంపన్నులైన ఎంపీలలో రమేష్ కూడా ఒకరని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ సంస్థ గత సంవత్సరం ఓ నివేదికలో తెలియజేసింది. అక్రమ మైనింగ్కు పాల్పడినందుకు రిత్విక్ ప్రాజెక్ట్స్కు గత సంవత్సరం రెండు కోట్ల రూపాయల జరిమానా విధించారు. వంశధార వాటర్ ప్రాజెక్టులో ఉపయోగించడానికి అని చెప్పి గ్రావెల్, మెటల్ను తరలించిన రిత్విక్ కంపెనీ వాటిని ప్రైవేటు వారికి అమ్ముకున్నదని జిల్లా విజిలెన్స్ అధికారి ఒకరు ‘ది న్యూ ఇండియా ఎక్స్ప్రెస్’ పత్రికకు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos