శూలం యాత్రకు నిరాకరణ : బిజెపి ఆందోళన

శూలం యాత్రకు నిరాకరణ : బిజెపి ఆందోళన

హోసూరు : తమిళనాడులో బిజెపి నిర్వహించతలపెట్టిన శూలం(వేల్) యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నేటి నుండి డిసెంబర్ 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా శూలం యాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మురుగన్ నేతృత్వంలో నిర్వహించతలపెట్టిన ఈ యాత్రకు రాష్ట్ర భుత్వం అనుమతి నిరాకరించింది. డిసెంబర్ 6వ తేదీ బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన రోజు కావడంతో రాష్ట్రంలో విధ్వంసాలు చెలరేగే ప్రమాదముందని, అందువల్ల వేల్ యాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వం కోర్టుకెక్కింది. దీనిపై అవాక్కయిన బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.అందులో భాగంగా హోసూరులో బిజెపి నాయకుడు నాగరాజ్ అధ్యక్షతన హోసూరు-బాగలూరు రోడ్డు సర్కిల్లో అయిదు వందల మందికి పైగా బిజెపి కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. వేల్ యాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. బిజెపి నాయకుల ఆందోళనతో హోసూరు-కృష్ణగిరి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అనుమతి లేకుండా రోడ్డుపై ఆందోళన చేపట్టిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos