అవినీతి ఊబిలో యడ్యూరప్ప- రాజీనామాకు కాంగ్రెస్ పార్టీ డిమాండు

అవినీతి ఊబిలో యడ్యూరప్ప- రాజీనామాకు కాంగ్రెస్ పార్టీ డిమాండు

బెంగళూరు: బెంగళూరు అభివృద్ది ప్రాధికార చేపట్టదలచిన నివాసాల నిర్మాణ పథకంలో జరిగిన అవినీతికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి యడ్యూరప్ప వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కర్నాటక కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. సానుకూలంగా స్పందింక పోతే ప్రజాందోళన చేపడతామని హెచ్చరించింది. ఉభయ సభల్లోనూ యడ్యూరప్ప అవినీతిని ఎండగడతామని తేల్చి చెప్పింది. వెంటనే నగదు అక్రమ బదిలీ, హవాలా, నేరాల కింద కేసుల్ని దాఖలు చేయాలని కోరింది. అత్యున్నత న్యాయ స్థానం న్యాయమూర్తి లేక ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండు చేసింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రణదీప్ సింగ్ సూర్జీవాలా బుధవారం ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు శివ కుమార్, శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్యతో కలసి బుధ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. యడ్యూరప్ప కుటుంబ సభ్యుల అవినీతి గురించి సోదాహరణంగా వివరించారు. ఆయన కుమారుడు విజయేంద్ర, అల్లుడు విరూపాక్ష మరడి, మనవడు శశిధర్ మరడి నివాసా నిర్మాణాల గుత్తేదారును బెదిరించి రూ. 17 కోట్లు నగదు పొందారని ఆరోపించారు. ‘ఉత్తర హళ్లి తాలూకా కోనేన అగ్రహార గ్రామం వద్ద ప్రాధికార రూ. 576 కోట్ల వ్యయంతో నివాసాల నిర్మాణానికి 2017లో టెండర్లు ఆహ్వానించింది. రామలింగం అనే గుత్తేదారుకు నిర్మాణ బాధ్యత దక్కింది. అంచనా వ్యయం రూ.660 కోట్లు. గుత్తేదారు మదుపుగారూ.32 కోట్లు ప్రాధికారకు చెల్లించారు. 2019లో నిర్మాణానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి.కానీ ఈ నిర్మాణాలు అవసరం లేదని 2020 మార్చిలో అప్పటి ప్రాధికార కమిషనరు రాకేశ్ సింగ్ ప్రభుత్వానికి లేఖ రాసారు. అది వరకే ప్రాధికార కట్టిన అనేక నివాసాలు అమ్మకానికి నోచుకోక పోవటంతో నిధుల కొరత ఎక్కువ ఉన్నందున కొత్తగా నివాసాల నిర్మాణాలు అవసరం లేదనేది లేఖ సారాంశం. దీని అదనుగా తీసుకుని విజయేంద్ర రంగ ప్రవేశం చేసారు. తనకు రూ.12 కోట్లు చెల్లిస్తే నివాసాల నిర్మాణానికి ఉన్న అవరోధాన్ని తొలగిస్తానని భరోసా ఇచ్చారు. ఆ మొత్తాన్ని తనకు తెలిసిన హోటల్ యజమాని రవికి చెల్లించాల్సిందిగా సూచించారు. ఎందువల్లో గుత్తేదారు ఆ మొత్తాన్ని అప్పటి ప్రాధికార కమిషనరు ప్రకాశ్కు ముట్టచెప్పారు. ఇదే విషయాన్నివిజయేంద్రకూ తెలిపారు. అయితే తనకు నగదు అందలేదని బదులివ్వటంతో గుత్తేదారు దిగ్భ్రంతికి గురయ్యాడు. తదనంతర పరిణామాల్లో తనకు రూ.17 చెల్లించాలని డిమాండు చేసారు. ఎలా చెల్లించాలో కూడా సూచించారు.గత్యంతరం లేక ఆయన రూ.7.40 కోట్లు నగదును యడ్యూరప్ప మనవడు శశిధర మరడికి ఇక్కడి శేషాద్రిపురం లోని హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతాకు ఆర్టిజిఎస్ ద్వారా బదిలీ చేసారు. మిగిలిన మొత్తాన్ని హుబ్బళ్లిలోని యడ్యూరప్ప అల్లుడు విరూపాక్షప్ప మరడి నివాసానికి నగదుగా ముట్ట చెప్పారు. ఆయన ఆ మొత్తాన్ని సక్రమ నగదుగా బదిలీ చేసుకునేందుకు కోల్కత్తానలోని ఏడు నకిలీ సంస్థలకు పంపాడు. ఆ సంస్థలు ఆ మొత్తాన్నిబెలా గ్రానియా సంస్థకు పంపాయి. అక్కడి నుంచి ఆ మొత్తం విఎస్ఎస్ ఎస్టేట్స్ సంస్థకు బదిలీ అయ్యింది. అది మొత్తాన్ని ఐదుగురి పేరిట రూ.కోటి వంతున ఫిక్సెడ్ డిపాజిట్లు చేసింద’ని సిద్దరామయ్య విపులీకరించారు. ఇంత అక్రమాలు జరుగుతున్నా ఆదాయపుపన్నుశాఖ, ఇడి సిబ్బంది నిద్రపోతున్నారని ప్రశ్నించారు. గుత్తేదారు విజయేంద్ర మధ్య జరిగిన దూరవాణ సంభాషణలు, గుత్తేదారు- శశిధర్ మరడి మధ్య జరిగిన వాట్సాప్ చర్చలు, బ్యాంకు ఖాతాలో నగదు జమకు సంబంధంచిన దాఖలాల్ని కోల్కత్తాలోని నకిలీ సంస్థల వివరాలు కూడా విడుదల చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos