నయనమనోహరం బనవాసి..

  • In Tourism
  • November 2, 2019
  • 405 Views
నయనమనోహరం బనవాసి..

లోతైన లోయల్లో దిగుతూ ఎత్తైన కొండలు ఎక్కుతూ దట్టమైన అడవుల మధ్యలో సాహసంతో కూడిన ప్రయాణం మధ్య మరింత దట్టమైన అడవుల్లో ఉన్న దేవాలయాలు సందర్శించాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది.ఈ కోరిక ఎప్పుడూ వాహనాల రణగొన ధ్వనులు,ట్రాఫిక్ ఇక్కట్లు,సిమెంటు అడవుల్లో జీవితం గడిపే నగర వాసుల్లో ఒకింత ఎక్కువగానే ఉంటుంది.అటువంటి వాళ్ల కోసం ఉత్తర కన్నడ జిల్లా వార్థా నది ఒడ్డున దట్టమైన పశ్చిమ కనుమల అడవుల్లో లోతైన లోయల్లో ఉన్న బనవాసి దేవాలయం దర్శనం ఒక చక్కటి అనుభవం.కర్ణాటకలోని అత్యంత పురాతన పట్టణాలు,దేవాలయాల్లో బనవాసి కూడా ఒకటి.మహాభారతంలో కూడా బనవాసి ప్రస్తావన ఉందంటే ఈ ప్రాంతం చరిత్ర ఎంతటి పురానతమైనదో అర్థం చేసుకోవచ్చు.వందల అడుగుల ఎత్తుతో ఎటు చూసినా పచ్చదనం పరచుకున్న గిరులు, గుబాళించే విరుల వనాలు, ఆహ్లాదం కలిగించే లోయలు, దశాబ్దాల నాటి నిర్మాణాలు ‘బనవాసి’లో ప్రత్యేక ఆకర్షణలు.

మధుకేశ్వర ఆలయం


‘బనా’ అనగా ‘అడవి’ ,’వాసి ‘ అనగా ‘వసంత’ అని అర్ధం .సాహిత్యపరంగా అయితే ఈ పట్టణాన్ని అడవిలో అప్పుడే వికసించిన వసంత౦గా చెప్పవచ్చు . బనవాసి కర్ణాటక లోని అతి పురాతన పట్టణాలలోఒకటిగా గుర్తించబడింది, మహాభారతం లో కుడా దీని ప్రస్తావన కలదు.తొమ్మిదో శతాబ్దంలో కదంబ రాజుల పరిపాలనలో నిర్మించిన మధుకేశ్వర దేవాలయం వల్ల బనవాసికి పురాతన గుర్తింపు,ఆదరణ దక్కుతోంది.అందమైన,ప్రత్యేకమైన నిర్మాణ చెక్కడములు మరియు నమూనాలు కారణంగా మధుకేశ్వర ఆలయం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా విరాజిల్లుతోంది.ఆలయంలోని ప్రతి నిర్మాణం,ప్రతి విగ్రహం కూడా ఎంతో అద్భుతంగా,ఆశ్చర్యంగా ఉంటాయి.

ఏకశిలతో చెక్కిన రాతి పాన్పు..


ఆలయంలోని మహా విష్ణువు విగ్రహంతో పాటు ఏకశిలతో్ చెక్కిన వినాయకుడు,త్రిలోక మంటపములో భూమి, స్వర్గము,పాతాళం నిర్మాణాలు అప్పటి శిల్పుల ప్రావీణ్యత,బుద్ధి కుశలతకు అద్దం పడతాయి.దేవాలయంలోని విగ్రహాల్లో అర్ధ గణేశుడి విగ్రహం ప్రధానమైన ఆకర్షణల్లో ఒకటి.ఇక్కడ గణేశుడి విగ్రహం అర్ధ భాగం మాత్రమే ఉంటుంది.మిగిలిన అర్ధ భాగం వారణాసిలో ఉందని స్థానిక చరిత్ర.నరసింహ స్వామి విగ్రహం కూడా ఈ మధుకేశ్వర ఆలయం లో చూడవచ్చు.

అర్ధ గణేశుడు


శివలింగం


వీటితో పాటు ఐదు పడగల నాగేంద్రుని శిల్పం కూడా ప్రధానంగా చూడాల్సిన నిర్మాణాల్లో ఒకటి.రెండో శతాబ్దంలో చెక్కిన ఈ శిల్పాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రాకృత భాషలో లిఖించిన శాసనాలు చూడవచ్చు.నంది విగ్రహం ఆలయ మండపంలో ఏకశిలతో మలచిన ఏడడుగుల నంది విగ్రహం అందరి దృష్టిని కట్టిపడేస్తుంది.మంటపం మధ్యలో ఉన్న భారీ నంది విగ్రహంలోని రెండు కళ్లు రెండు వైపులా చూస్తున్నట్లు ఉంటాయి.కుడి కంటితో పార్వతి దేవిని ఎడమ కంటితో లయకారుడిని చూస్తున్నట్లు ఉంటాయి.బనవాసి పట్టణం కర్ణాటక మొదటి రాజధానిగా వెలుగొందినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.ఇక ఆలయం ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఏకశిలతో చెక్కిన ఏనుగుల శిల్పాలు చూస్తూనే ఉండిపోవాలనిపిస్తాయి.

నంది విగ్రహం


ఏకశిలతో చెక్కిన ఏనుగు శిల్పం.


నృత్యప్రదర్శనలు నిర్వహించే ‘త్రిలోక మంటపం’ మరో అద్భుత కట్టడం.మంటపం భారీ స్తంభాలు, మంటపం పైకప్పు అద్భుత శిల్పకళతో ఉట్టిపడుతుంటాయి. మహాశిల్పిగా ప్రసిద్ధి చెందిన ‘అమరశిల్పి జక్కన’ ఈ ఆలయంలో శిల్పకళను తీర్చిదిద్దాడని స్థానిక చరిత్ర.కదంబోత్సవం పేరుతొ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

త్రిలోక మంటపం


బనవాసి చుట్టూ ఉన్న పంపా వనము, సిర్సి, వార్ధా నది, శాస్త్రలింగ, శ్రీ మారికాంబ ఆలయం, సొండా మఠము, శ్రీ హనుమాన్ పద్మావతి దేవి జైన్ ఆలయం, కురువతి బసవేశ్వర ఆలయం, సిద్దేశ్వర ఆలయం, వరసిద్ధి వినాయక ఆలయం, మైలార లింగేశ్వర ఆలయం మరియు ఇతరములు చూడదగ్గవి. వీటితో పాటు పశ్చిమ కనుమల్లోని జలపాతాలు,సమీపంలోని సముద్ర తీరాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి.

కదంబ రాజుల కాలం నాటి నాణేలు


ఇలా చేరుకోవాలి..
బెంగుళూరు నగరం నుంచి 374 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనవాసికి రోడ్డు,రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు.హవేరి,తలగుప్ప రైల్వేస్టేషన్లు చేరుకొని అక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనవాసి చేరుకోవచ్చు.లేదా శిర్సి పట్టణం చేరుకొని అక్కడి నుంచి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనవాసికి సులభంగా చేరుకోవచ్చు.ఇతర నగరాలతో బాగా అనుసంధాన మార్గాలు ఉండడంతో ఈ పట్టణానికి సులువుగానే చేరుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos