ఏపీ ప్రత్యేకహౌదాను ఎన్నికల మ్యానిఫెస్టోల్లో చేర్చాలి

ఏపీ ప్రత్యేకహౌదాను ఎన్నికల మ్యానిఫెస్టోల్లో చేర్చాలి

న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హౌదా సాధనకు ఉద్యమం తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హౌదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ”ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హౌదా ఇవ్వాలి, విభజన సమస్యల పరిష్కారం” అనే అంశంపై శుక్రవారం నాడిక్కడ ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఐసీసీ)లో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రత్యేక హౌదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇలాంటి సదస్సు ద్వారా మేధావుల అభిప్రాయాలను తెలుసుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రత్యేక హౌదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హౌదా కోసం పోరాడే వాళ్లకే ఓట్లు వేయాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఢిల్లీలో తిష్టవేసి పొత్తుల కోసం ఆరాటపడుతున్నాయని, అంతేతప్ప ప్రత్యేక హౌదా గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని, పరిపాలన దెబ్బ తిన్నదని విమర్శించారు. రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. దీన్ని ఒక ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ కేశవ్ కుమార్ ”లక్ష్యాలను సాధించడానికి రాజకీయ వ్యవస్థను ఎలా ప్రభావితం చేయాలి”, ప్రొఫెసర్ చిట్టిబాబు ” ప్రత్యేక హౌదా-నిరుద్యోగం, ప్రొఫెసర్ సుకుమార్ ”పౌర సమాజాన్ని ఎలా సమీకరించాలి ?”, డాక్టర్ పెంటపాటి పుల్లారావు ”పోలవరం-నిర్వాసితులు ”, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ”తెలుగు రాష్ట్రాల ప్రస్తావనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం”, ప్రొఫెసర్ ఎన్.ఆర్. సదా శివ రెడ్డి ”ప్రత్యేక హౌదా ప్రయాణం-పోరాటం” వంటి అంశాలపై మాట్లాడారు. ఈ సదస్సులో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ. అశోక్, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos