బాబును ఎల్లో మీడియా గొప్పగా చిత్రీకరిస్తోంది!

బాబును ఎల్లో మీడియా గొప్పగా చిత్రీకరిస్తోంది!

సాక్షి, విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎల్లో మీడియా గొప్పగా చిత్రీకరిస్తోందని, గత నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయకపోయినా… ఎల్లో మీడియాకు మాత్రం ఆయన గొప్పగా కనిపిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు అంటే.. అందుకు అనుగుణంగా ఎల్లో మీడియా కూడా కథనాలు రాసిందని ఆయన గుర్తుచేశారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబుకు మానసిక వైకల్యం బాగా పెరిగిపోయిందని అంబటి ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ భౌతికకాయం వద్దే టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌తో ఆయన పొత్తుల గురించి మాట్లాడారని, టీఆర్‌ఎస్‌ ఛీ అన్న తర్వాతే ఆయన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు. ఏపీ ప్రజల కన్నీరుకు కారణమైన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని, అలాంటి కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి తానే కారణమని చంద్రబాబు అంటున్నారని, మరి ఏ ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా చంద్రబాబు వల్లే తాము గెలిచామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీకి పెట్టుబడి పెట్టే ఆసామిగా చంద్రబాబు మారిపోయారని, చంద్రబాబువి పచ్చి అవకాశవాద రాజకీయాలని అంబటి మండిపడ్డారు. ఆపరేషన్‌ గరుడ సృష్టికర్త చంద్రబాబేనని, నటుడు శివాజీ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చంద్రబాబు ప్రయోగించిన అస్త్రాలేనని అన్నారు. 2014లో రూ. 96వేల కోట్ల అప్పులు ఉంటే.. ఇవాళ రూ. 2.50 లక్షల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీని చంద్రబాబు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో దుర్మార్గమైన పాలన సాగుతోందని, అడ్డగోలుగా దోచుకున్న అవినీతి డబ్బుతో మళ్లీ ఎన్నికల్లో గెలువాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంబటి స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos