ఈ గుడిలో స్తంబం యుగాంతానికి చిహ్నం..

  • In Tourism
  • October 12, 2019
  • 473 Views
ఈ గుడిలో స్తంబం యుగాంతానికి చిహ్నం..

యుగాంతం గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు.హేతువాదులు,హాలీవుడ్ సినిమా దర్శకులు సనామీలు రావడం,అగ్నిపర్వతాలు బద్దలవ్వడం,సముద్రాలు ముంచెత్తడం ఇలా చూపిస్తే దేవుడిని నమ్మేవాళ్లు భూమిపై పాపాలు ఎక్కువైన వెంటనే దేవుడు భూమిని భస్మీపటలం చేస్తాడంటూ చెబుతుంటారు.యుగాంతం గురించి స్థానికంగా కూడా చాలా కథలు వినిపిస్తున్నా యుగాంతంపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.యుగాంతం గురించి స్థానికంగా వినిపంచే కథల్లో ఒకటి మహారాష్ట్ర రాష్ట్రంలోని హరిశ్చంద్ర ఘడ్.ఎన్నో నదులకు, ప్రకృతి అందాలకు పుట్టినిల్లైన పశ్చిమ కనుమల్లో ఉన్న హరిశ్చంద్ర ఘడ్ కోటలో యుగాంతం అని ఆ అలజడి రేపే అంశాలు దాగి ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు.అహ్మద్‌నగర్‌ జిల్లాలో సముద్రమట్టానికి సుమారు 1,424 మీటర్ల ఎత్తులో ప్రకృతి అందాల మధ్య ఉన్న హరిశ్చంద్ర ఘడ్ కోటలో ఉన్న కేదారేశ్వర్ స్వామి ఆలయం ఈ మందిరం పైన ఒక పెద్ద బండరాయి, కింద నాలుగు స్తంభాల పై గుడి కట్టారు ఇది ఎప్పుడు నిర్మించారో ఎవరు నిర్మించారో కూడా ఎవరికీ తెలీదు.ఇక్కడున్న నాలుగు స్తంభాలు సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం సంకేతాలు గా నిలిచాయని చెబుతుంటారు. ఒక్కో యుగాంతానికి ఒక్కో స్తంభం విరిగిపోతూ వస్తోందని ప్రస్తుతం కలియుగం మాత్రమే ఉండడంతో కేదారేశ్వర్ గుహాలయం ఒక స్తంభం పైన మాత్రమే ఉందని ఎప్పుడైతే ఈ స్తంభం కూడా విరిగిపోతుందో ఆ రోజు ఈ కలియుగానికి ఆఖరి రోజు గా నిర్దారించారు.

యుగాంతం చిహ్నంగా ఒంటి స్తంబం కింద శివలింగం


ఇంకో అంతుచిక్కన విషయం ఏమిటంటే గుడి నాలుగు గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది. ఆ నీరు చల్లగా ఉంటుంది.మరో విచిత్రమైన విషయం ఏంటంటే వర్షాకాలంలో చుక్క నీరు కూడా ఉండని ఈ గుడిలో శీతాకాలం,వేసవి కాలంలో మాత్ర ఐదు అడుగుల మేర నీరు ఉంటుంది.హరిశ్చంద్ర ఘడ్ కోట చాలా పురాతనమైనదని మత్స్య పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణాల్లో పేర్కొనడం ద్వారా తెలుస్తోంది.కోట ఆవరణలో అందమైన విష్ణు దేవాలయం దగ్గర్లో పురాతన బౌద్ధ గుహలు ఉన్నాయి మధ్య యుగ కాలానికి చెందిన నాగేశ్వర్ ఆలయం, హరిశ్చంద్రేశ్వర్ ఆలయం.ఇక్కడి సప్త తీర్థ పుష్కరణికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.వేసవి కాలంలో ఈ పుష్కరిణి వద్ద నిలబడితే ఏసీ గదిలో ఉన్నట్లు ఉంటుందని స్థానికులు,పర్యాటకులు చెబుతారు.ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను పుష్కరిణిలో పారేస్తుండడంతో ఏడేళ్లుగా పుష్కరిణిలోకి పర్యాటకులను నిషేధించారు.

సప్తతీర్థ పుష్కరిణి


హరిశ్చంద్రగడ్ గుహలు దాదాపు కోట అంతటా గుహలు విస్తరించాయి. వాటిలో కొన్ని తారామని పీక్ వద్ద మరియు బస చేసే వద్ద ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి.హరిశ్చంద్రేశ్వర్ ఆలయం ఇదొక గుహాలయం. ట్రెక్కింగ్‌కు వచ్చే వారు ఇక్కడ వసతి పొందవచ్చు. సమీపంలో అనేక వాటర్ ట్యాంక్‌లు ఉన్నాయి. ఆలయ రాతి నిర్మాణం నిజంగా ఆశ్చర్యం కలిగించక మానదు. గణపతి విగ్రహం నల్లటి రాతి నిర్మాణాల మధ్య చెక్కుచెదరకుండా భక్తులను, యాత్రికులను ఆకట్టుకుంటున్నది.

హరిశ్చంద్ర ఘడ్ కోట..


చుట్టూ అందమే..
హరిశ్చంద్ర ఘడ్ కోట చుట్టూ ఆహ్లాదాన్ని,తన్మయత్వాన్ని పంచే ప్రకృతి అందం,మరెన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.మల్షేజ్ ఘాట్, పిమ్పల్‌గావ్‌ జోగా డ్యామ్, ప్లేమింగో పక్షులు,శివాజీ పుట్టిన కోట ఇలా ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.హరిశ్చంద్ర ఘడ్ కోట నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్షేజ్ ఘాట్ ప్రకృతి అందాల ప్రేమికులకే కాదు ట్రెక్కింగ్ అంటే పడిచచ్చే సాహస క్రీడల ప్రేమికులకు కూడా స్వర్గధామమే.మల్షేజ్ ఘాట్ కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ హరిశ్చంద్ర ఘడ్ కోట చేరుకోవడం జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపంగా మిగిలిపోతుంది. రాజూర్ గ్రామం నుంచి మొదలయ్యే కొథలే లోయ నుంచి సుమారు ఐదు గంటల పాటు ట్రెక్కింగ్ చేసుకుంటూ యుగాంతం చోటుకు చేరుకోవచ్చు.

రాక్‌ క్లైంబింగ్‌


కొండ మీదకి చేరుకోవటానికి 4 -5 మార్గాలు ఉన్నాయి అందులో ప్రసిద్ధి గాంచిన రూట్లు ఖిరేశ్వర్ నుంచి గుహలు, వాటర్ ట్యాంక్ ల ను దాటుకుంటూ జున్నార్ దర్వాజా వరకు చేరుకోవాలి అక్కడి నుండి నేరుగా తోలార్ ఖింద్ కు చేరుకొని కొద్ది దూరం నడవాలి రాళ్ళ గుట్టలను, తక్కువ అడవులున్న పీఠభూమి మైదానాలను,ఏడు కొండలను దాటుకుంటూ 2 – 3 గంటలు నడిస్తే హరిశ్చంద్రగడ్ చేరుకోవచ్చు.లేదంటే దట్టమైన అటవి ప్రాంతంలో బలెకిల్ల అనే మార్గం మీదుగా కనుక వెళ్తే రెండు గంటల్లో కోటకు చేరుకోవచ్చు.అయితే దట్టమైన అటవీ ప్రాంతం కనుక సమూహంగా వెళ్ళాలి.అందమైన సూర్యోదయాలను, సూర్యాస్తమయాలు చూడాలనుకుంటే కొంకణ్ క్లిఫ్ వెళ్లాలి. ప్రకృతి అందాలను, లోయ అందాలను, సహజ ప్రకృతి దృశ్యాలు,దూరంగా వన్యప్రాణులను కూడా గమనించవచ్చు.ఇక్కడికి సమీపంలోని పిమ్పల్‌గావ్‌ జోగా డ్యామ్ ప్రాంతాల అందాలతో పాటు జామ పోలంక, విస్లింగ్ త్రష్, కంజు పిట్ట, నీల బోలకోడి లాంటి పక్షుల విహంగ విహారం కళ్లకు,మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది..

పిమ్పల్‌గావ్‌ జోగా డ్యామ్‌


జలపాతం హొయలు..


జలపాతాల హొయలు..


ఎలా చేరుకోవాలి ?
థానే, పూణే మరియు అహ్మద్ నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న హరిశ్చంద్ర ఘడ్ చేరుకోవాలంటే థానే జిల్లా నుంచి కల్యాణ్ అనే పేరుగల ఊరికి బస్సులో లేదా ప్రైవేటు,సొంత వాహనాల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి ఖుబిఫట గ్రామానికి చేరుకొని మళ్లీ అక్కడి నుంచి ఖిరేశ్వర్ గ్రామానికి బస్సు లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించాలి ఖిరేశ్వర్ నుంచి ఏడు కి.మీ వరకు ట్రెక్కింగ్ చేస్తే కొండమీదున్న హరిశ్చంద్రగడ్ కోట చేరుకోవచ్చు.లేదా కొత్తగా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిన రాజూర్ నుంచి కొథలె(లోయ ప్రాంతం) కాలినడకన వెళ్తే యుగాంతం చోటు కు వెళ్ళవచ్చు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos