ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామిక సంప్రదా యాలను కాలరాస్తు న్నారని పలువురు మేధావులు, విద్యా వేత్తలు, రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. అనేకమంది రచయితలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలను ఎలాంటి విచారణ లేకుండా దీర్ఘకాలం నిర్బంధించడం, వారిపై చార్జిషీటు దాఖలు చేయకపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే అవుతుందని చెప్పారు. ఈ మేరకు వారు ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖకు నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ విడిగా ఓ లేఖను జత చేశారు. న్యూస్క్లిక్ ఎడిటర్-ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ నిర్బంధంతో పాటు భీమా కోరేగావ్ కేసులో, ఢిల్లీ మత హింస కేసులో హక్కుల కార్యకర్తలను నిర్బంధించడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి చేసిన సవరణలను అడ్డు పెట్టుకొని ఎలాంటి విచారణ జరపకుండా వీరందరినీ చాలా కాలం నుంచి నిర్బంధంలో ఉంచారు. ఈ సవరణలకు చట్టసభ మద్దతు ఉన్నదని చెబుతున్నారు. అయితే ఇలాంటి నిర్బంధాలను చట్టసభలు సమర్ధించడం లేదు’ అని వారు ఆ బహిరంగ లేఖలో వివరించారు. దీనిపై అమర్త్యసేన్తో పాటు రచయిత అమితావ ఘోష్, వెండీ బ్రౌన్, గాయత్రి చక్రవర్తి స్పివాక్, మార్తా సి నుసాబమ్ తదితరులు సంతకాలు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి ఓ గొప్ప ఉదాహరణగా భారత్ను అంతర్జాతీయ సమాజం ప్రశంసిస్తోంది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం విషాదకరం. భారత ప్రజలకే కాదు… మొత్తం మానవాళికి కూడా. దేశంలో చోటుచేసుకుంటున్న ఇలాంటి ఆందోళనకరమైన పరిణామాలపై అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేయడానికి ఈ లేఖ రాస్తున్నాము. ప్రభుత్వంలో వివిధ విభాగాలలో బాధ్యతాయుతమైన పదవులు నిర్వర్తిస్తున్న వారు…ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్న వారు ఇలాంటి వాటిని నిలువరించాల్సిన అవసరం ఉంది. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాల్సి ఉంది’ అని వారు ఆ లేఖలో కోరారు. విడిగా రాసిన లేఖలో అమర్త్యసేన్ పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటీష్ పాలనలో విచారణలు జరపకుండా ప్రజలను దీర్ఘకాలం పాటు నిర్బంధించే వారని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్రానంతరం దేశంలో ఇలాంటివి ఆగిపోతాయని తాను భావించానని, కానీ అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వదేశంలో మానవ స్వేచ్ఛకు విఘాతం కలగడం కలచివేస్తోందని అమర్త్యసేన్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos