పదవుల పందేరానికి ఏడీఎంకే కసరత్తు

పదవుల పందేరానికి ఏడీఎంకే కసరత్తు

హోసూరు : తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడీఎంకే పార్టీని బలోపేతం చేయడానికి అధిష్టానం చర్యలు చేపట్టింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ మరోసారి విజయ ఢంకా మోగించాలనే ఆశయంతో సన్నాహాలు చేసుకొంటోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలను ప్రారంభించింది. కృష్ణగిరి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హోసూరు మేయర్, హోసూరు శాసన సభ స్థానాన్ని పార్టీ కైవసం చేసుకొనే విధంగా అధిష్టానం మాస్టర్ ప్లాన్ తయారు చేసినట్లు సమాచారం. హోసూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం ఒక యూనియన్ కార్యదర్శి ఉండగా పార్టీ బలోపేతంలో భాగంగా ముగ్గురు యూనియన్ కార్యదర్శులను నియమించేందుకు అధిష్టానం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారమందింది. హోసూరు యూనియన్కు ఇద్దరు, హోసూరు అసెంబ్లీ సెగ్మెంట్లో సూలగిరి యూనియన్లోని ఆరు పంచాయతీలకు ఒక యూనియన్ కార్యదర్శిని నియమించనున్నట్లు సమాచారం. అదేవిధంగా పార్టీ హోసూరు మహా నగర కార్యదర్శి పదవిలో ఉన్న వ్యక్తులను కూడా మార్చాలని అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుతం హోసూరు మహా నగర కార్యదర్శి పదవిలో ఉన్న పాల్ నారాయణ స్థానంలో చిట్టి జగదీశ్ను నియమించనున్నట్లు తెలిసింది. అధిష్టానం అన్నికోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టులకు జాబితాను తయారు చేసి సిద్ధంగా ఉంచినట్లు సమాచారాం. హోసూరు మేయర్ స్థానంతో పాటు చేజారిపోయిన హోసూరు ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా పార్టీలో ప్రక్షాళన చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు ఏడీఎంకే వర్గాల ద్వారా తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos