సోమనాథపురానికి రేషన్ షాపును తెచ్చింది ఎవరు….?

సోమనాథపురానికి రేషన్ షాపును తెచ్చింది ఎవరు….?

హోసూరు యూనియన్లోని వన్నలవాడి పంచాయతీలో గల సోమనాథపురంలో పార్ట్ టైం రేషన్ షాపును ప్రారంభించడం అటుంచితే, ఆ రేషన్ షాపును గ్రామానికి తెచ్చిందెవరనేది చర్చనీయాంశమైంది. హోసూరు సమీపంలోని వన్నలవాడి పంచాయతీలో గల సోమనాథపురం గ్రామంలో రేషన్ షాపు లేకపోవడంతో ఆగ్రామానికి చెందిన 120 మంది లబ్ధిదారులు అదే పంచాయితీ లోని కారుపల్లి గ్రామంలో గల రేషన్ షాపులో నిత్యావసర వస్తువులను పొందేవారు. సోమనాథపురం గ్రామ ప్రజల శ్రమను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో పార్ట్ టైం రేషన్ షాపును ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.అందులో భాగంగా సోమనాథపురం గ్రామంలో పార్ట్ టైం రేషన్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట ఎడిఎంకె పార్టీ నాయకులు పార్ట్ టైం రేషన్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా హోసూరు యూనియన్ చైర్ పర్సన్ శశి వెంకటస్వామి పాల్గొని వినియోగదారుల కు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎడిఎంకె పార్టీ నాయకులు హరీష్ రెడ్డి, జయకుమార్, బిజెపి నాయకుడు మునిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కొద్ది సేపటికి సోమనాథపురం గ్రామానికి చేరుకున్న డిఎంకె పార్టీ ప్రముఖులు పార్ట్ టైం రేషన్ షాపు తమ వల్లే వచ్చిందని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ
హోసూరు ఎమ్మెల్యే సత్య ద్వారా రెండవ సారి రేషన్ షాపును ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్య వినియోగదారులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఒకపక్క సోమనాథపురం గ్రామంలో పార్ట్ టైం రేషన్ షాపును ప్రారంభించడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేసినా, రేషన్ షాపును ప్రారంభించడానికి ఇరు పార్టీల నాయకులు చేసిన హడావిడిని చూసి గ్రామ ప్రజలు తలలు గోక్కున్నారు.ఇంతకీ సోమనాథపురం గ్రామానికి రేషన్ షాపును తెచ్చింది ఎడిఎంకె పార్టీ నాయకులా లేక డిఎంకె పార్టీ నాయకులా అని గ్రామ ప్రజలు అయోమయంలో పడ్డారు. రాక రాక గ్రామానికి రేషన్ షాపు వస్తే నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమాలను రెండు సార్లు నిర్వహించడం ఏమిటని గ్రామ ప్రజలు గుసగుసలాడుకొంటున్నారు. అరిసియలిల్ ఇదెల్లా సగజమప్పా అని మరికొందరు నిట్టూరుస్తున్నారు. ఏది ఏమైనా ఇదంతా ఎన్నికల ఎఫెక్ట్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos