పంజాబ్ రెవిన్యూ అధికారుల మెరుపు సమ్మె

చండీగఢ్ : పంజాబ్లోని లంబీ గ్రామంలో రైతుల నుంచి చేదు అనుభవం ఎదురవడంతో రెవిన్యూ అధికారులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ గ్రామ రైతులు సోమవారం దాదాపు ఆరు గంటల పాటు రెవిన్యూ అధికారులను నిర్బంధించారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం తో విముక్తి పొందారు. పోలీసులు లాఠీ ఛార్జి కూడా చేసారు. ఈ రైతులకు భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహణ్) మద్దతు ఉంది. పోలీసుల లాఠీఛార్జిలో బీకేయూ ముక్తసర్ జిల్లా అధ్యక్షుడు గుర్పష్ సింగ్ సింఘేవాల్, మరో ఆరుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.రెవిన్యూ అధికారులను నిర్బంధించిన రైతులపై భారత శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. అధికారుల సంఘం అధ్యక్షుడు గుర్దేవ్ సింగ్ ధామ్ మాట్లాడుతూ, నిరవధిక సమ్మె కొనసాగుతుందని చెప్పారు. పోలీసుల చర్య తర్వాత వివిధ రెవిన్యూ సిబ్బంది సంఘాలు సమావేశమవలేదని చెప్పారు. ఈ సమస్యను తమకు సంతృప్తి కలిగే విధంగా పరిష్కరించడంపై ఈ సమ్మెను విరమించడం ఆధారపడి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ, పింక్ బోల్వార్మ్ కారణంగా పత్తి పంటకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని తాము అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బీకేయూ నేత జోగిందర్ సింగ్ ఉగ్రహణ్ మాట్లాడుతూ, రైతుల డిమాండ్లు న్యాయమైనవని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos