ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం ఆగుంబె..

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం ఆగుంబె..

ప్రకృతి అందాలతో,ఎటు చూసినా పచ్చని తివాచిలో కనిపించే పచ్చదనంతో ఎత్తైన కొండలు,దట్టమైన చెట్లు,కొండల మధ్య నుంచి వయ్యారంగా జాలువారే జలపాతాలు,అరుదైన పక్షులు,వన్యప్రాణులు,అత్యంత విషపూరతిమైన నల్లత్రాచులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రకృతి విశేషాలకు ఆలవాలమైన దక్షిణాది చిరపుంజిగా ప్రసిద్ధి గాంచిన ఆగుంబేను జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా కేంద్రం నుంచి 93 కిలోమీటర్ల దూరంలో దట్టమైన పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ కుగ్రామం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమే.పడమటి కనుమల్లో పుష్కలంగా వర్షాలు కురిసే ఆగుంబెలో చెవులకు ఇంపైన పక్షుల కిలకిలలు తప్ప వాహనాల రణగొణలేవీ ఇక్కడ వినిపించవు.పశ్చిమ కనుమల్లో ఉన్న ప్రదేశంలో జూన్నుంచి సెప్టెంబర్మధ్యకాలంలో అత్యధిక వర్షపాతం పడుతుంది. మాన్సూన్సీజన్లో అడవి మొత్తం పొగమంచుతో ఉంటుంది.అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణాది చిరపుంజి అని పిలుస్తుంటారు.ఆగుంబెలో అడవుల్లోని కుంచికల్ఫాల్స్‌, బర్కానా ఫాల్స్అందాలతో పాటు ఇక్కడున్న అగుంబె రెయిన్ఫారెస్ట్రీసెర్చ్స్టేషన్ను ప్రతి ఒక్కరు సందర్శించి తీరాల్సిందే.అగుంబే చుట్టుపక్కల ముఖ్యంగా చూడాల్సినవి ఇక్కడి జలపాతాలనే. కొండల మీదుగా నేల మీదకు ఉరికే జలపాతాలు ఇక్కడ అడుగడుగునా తారసపడతాయి. ముఖ్యంగా బర్కానా జలపాతం, కూడ్లుతీర్థ జలపాతం, జోగిగుండి జలపాతం వంటి జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. వారంతంలో రెండు రోజుల ట్రిప్ కు ప్రదేశం చాలా అనుకూలమైనది మరి బెంగళూరు నుండి అగుంబే రోడ్ ట్రిప్ ఎలా ఉంటుంది.ఇంతటి విశేషాలున్న ఆగుంబెలో చూడదగిన మరిన్ని ప్రాంతాల గురించి తెలుసుకుందాం పదండి..
సహజంగా వర్షాలు అత్యధికంగా కురిసే ప్రాంతం కావడంతో ఆగుంబె అటవీప్రాంతంలో చాలా జలపాతాలు ప్రకృతి సహజంగా ఏర్పడ్డాయి.వాటిలో ముఖ్యమైనది కుంచికాళ్‌ జలపాతం.సుమారు 1,493 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే ఈ జలపాతం పర్యాటకులను చూపు తిప్పుకోనివ్వదంటే అతిశయోక్తి కాదు.దేశంలో ఎత్తు నుంచి జాలువారే జలపాతాల్లో కుంచికాళ్‌ జలపాతం కూడా ఒకటి.

కుంచికాల్‌ జలపాతం..


సూర్యాస్తమయం అద్భుతం..
ఆగుంబెలో తప్పకుండా చూడాల్సిన దృశ్యం సూర్యాస్తమయం.అగుంబే
ఉడిపి రోడ్డుకు చేరువలోని ఎత్తయిన శిఖరంపై ఉన్న సన్సెట్ వ్యూపాయింట్ నుంచి నుంచి చూస్తే సుదూరాన అరేబియన్ సముద్రంలోకి కుంగుతున్న సూర్యబింబం కనిపిస్తుంది.ఇక్కడి సూర్యాస్తమయ దృశ్యాన్ని తిలకించడానికి పర్యాటకులు,స్థానికులు సైతం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు..

ఆగుంబెలో సూర్యాస్తమయం..

జీవవైవిధ్యానికి నిలయం..
ఇక్కడ
చూడాల్సిన ప్రదేశాల్లో అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి. ఏడాది మొత్తంలో  ఏడు వేల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అగుంబేలోని అడవుల వైవిధ్యంపై ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూ ఉంటారు. వాటి విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.దీంతోపాటు ఇక్కడి జీవవైవిధ్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న పర్యాటకులు అగుంబే చేరువలోని సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, కుద్రేముఖ్ జాతీయ పార్కులను తిలకించవచ్చు. రెండు చోట్ల రకరకాల వన్యప్రాణులు, అరుదైన పక్షులు కనిపిస్తాయి.

రెయిన్‌ ఫారెస్ట్‌ రీసర్చ్‌ స్టేషన్‌..

ప్రకృతి అందాలు..

నల్లత్రాచులకు పుట్టినిల్లు..
అత్యంత విషపూరితమైన నల్లత్రాచు అలియాస్‌ కింగ్‌ కోబ్రాకు ఆగుంబె పుట్టినిల్లుగా భావిస్తారు.1870వ సంవత్సరంలో నల్లత్రాచులను గుర్తించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.సుమారు 13 అడుగుల నుంచి ఒక్కోసారి 20 అడుగుల వరకు పొడవు ఉంటే నల్లత్రాచులు అటవీప్రాంతాల్లో అప్పుడప్పుడూ రోడ్లపై కూడా దర్శనమిస్తూ రాజసం ఒలకబోస్తుంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఆగుంబెను నల్లత్రాచులకు ప్రపంచ రాజధానిగా భావిస్తారు..

భారీ నల్లత్రాచులు..


జలపాతాల సవ్వడి..
ఆగుంబెకు సమీపంలోని కొండలపై బర్కానా,ఒనకి,జోగి గుండి జలపాతాలు కూడా చూడదగిన ప్రాంతాలు.ఒక్కో జలపాతం సుమారు 820 అడుగుల ఎత్తు నుంచి దూకుతుంటే వాటి సవ్వడికి పర్యాటకుల మనసులు కూడా పరవళ్లు తొక్కుతుంది.సీతానది కొండలపై నుంచి ప్రవహించడం ద్వారా బర్కానా జలపాతాన్ని సీతా జలపాతంగా కూడా పిలుస్తుంటారు.ఈ
జలపాతాన్ని చేరాలంటే గుంబో ఘాట్ల ద్వారా ట్రెక్కింగ్ చేయాలి లేదా బైక్ రూట్‌‌లో వెళ్లాలి.ఆగుంబేకు దగ్గర్లో ఉండే మరో జలపాతంఒనకిజలపాతం.ఒనకి అంటే తెలుగులో దంపుకర్ర అనే అర్థం వస్తుంది.చూడడానికి ఈ జలపాతం అలానే ఉండడంతో ఒనకి పేరుతో పిలుస్తుంటారు.ఆగుంబె నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉండే జోగి గుండి జలపాతాలు చాలా పురాతనమైనవి.ఇక్కడకు చేరుకోవాలంటే సగం దూరం వాహనాల్లో ప్రయాణించి మిగిలిన దూరం ట్రెక్కింగ్ చేయాలి.ఆగుంబెలోని మరో చూడదగిన జలపాతం అంటే తీర్థ జలపాతాలు.సుమారు 126 అడుగుల ఎత్తునుంచి ఒక సరస్సులోకి పడే తీర్థ జలపాతాలకు చేరుకోవాలంటే మూడు కిలోమీటర్లు అడవిలో ట్రెక్కింగ్ చేసి చేరుకోవాలి.

బర్కానా జలపాతం..

జోగి గుండి జలపాతం..

తీర్థ జలపాతాలు..


వీటితోపాటు శృంగేరి,ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రం కూడా..
అగుంబేలోని శ్రీకృష్ణ ఆలయం, శ్రీ సిద్ధి వినాయక ఆలయం, నడబర ఈశ్వరాలయం, ఇక్కడకు చేరువలోని నాగూరులో ఆంజనేయ ఆలయం వంటి పురాతన ఆలయాలు ఆధ్యాత్మిక ఆసక్తి గల పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి చేరువలోనే ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రం, శృంగేరీ శంకరాచార్య పీఠం ఉన్నాయి. అగుంబేలో విహార యాత్ర తర్వాత వీటిని కూడా సందర్శించుకోవచ్చు.

శృంగేరి..

ఇలా చేరుకోవాలి..
బస్సు లేదా రైలు మార్గంలో శివమొగ్గ లేదా చిక్కమగళూరు లేదా ఉడుపికి చేరుకోవాలి.అక్కడి నుంచి నేరుగా లేదా శృంగేరి మీదుగా ఆగుంబేకు చేరుకోవచ్చు.ఆగుంబెకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శృంగేరి పట్టణంలో ఉండడానికి అనువైన లాడ్జ్‌లు,హోంస్టేలు ఉన్నాయి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos