ఐస్‌క్రీమ్‌లను నాకుతూ తినొద్దు, కాదు- టర్కీ అమ్మాయిలకు శిక్షణ

ఐస్‌క్రీమ్‌లను నాకుతూ తినొద్దు, కాదు- టర్కీ అమ్మాయిలకు శిక్షణ

“అమ్మాయిలు ఐస్‌క్రీమ్‌లను నాకుతూ తినొద్దు, ఇది మర్యాద కాదు”… టర్కీలో ఈ ప్రకటనపై ఇప్పుడు వివాదం రేగుతోంది.టర్కీలోని మిల్లియెట్ డైలీ కథనం ప్రకారం, “అమ్మాయిలు ఎలా ఉండాలి?” అనే కోర్సులో భాగంగా వారు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఇస్తాంబుల్‌లోని ఓ సంస్థ శిక్షణనిస్తోంది.ప్రజారవాణా వాహనాల్లో సరైన రీతిలో కూర్చోవాలి, ఆహారాన్ని నమిలే సమయంలో వీలైనంత తక్కువగా మాట్లాడాలి, ఉదయం పూట ఎక్కువగా మేకప్ వేసుకోవద్దు, అసభ్యకర పదాలను మాట్లాడొద్దు, బ్రో అనే పదాన్ని ఉపయోగించవద్దు… ఇవి వారి సూచనల్లో కొన్ని.

సోషల్ మీడియాలో విమర్శలు

వీటిలో చాలావరకూ మర్యాదపూర్వకంగా నడుచుకోవడంలో భాగంగా చేసే పనుల్లాగా ఉన్నప్పటికీ, ఒక్క ఐస్‌క్రీమ్ తినే విషయంలో మాత్రం వారిచ్చిన సలహా సోషల్ మీడియాలో వివాదంగా మారింది.ఆడవాళ్లు ఐస్‌క్రీమ్ నాకుతూ తినకూడదని చెప్పారే తప్ప ఎందుకు ఇలా చేయకూడదో కారణాలు మాత్రం వెల్లడించలేదు. అలాగే ఇలాంటి ఆహారాన్ని ఇంకెలా తినాలో కూడా సూచించలేదు. దీనిపై ట్విటర్లో విమర్శలు వెల్లువెత్తాయి.నాకుతూ తినకూడదు అంటే ఇంకెలా తినాలి? అని ఓ యూజర్ ట్విటర్లో ప్రశ్నించారు.”నేను ఈ కోర్సు పూర్తి చేశాను. ఇప్పుడు నేను ఐస్‌క్రీమును కొరుక్కుని తింటున్నా” అంటూ మరో యూజర్ పోస్ట్ చేశారు.

అమ్మాయిలైనా అబ్బాయిలైనా అలాగే తింటారు కదా!

ఇలాంటి సూచనల ద్వారా అమ్మాయిల స్వేచ్ఛపై ఆంక్షలు విధించాలనుకుంటున్నారా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.”ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వాటిని వెంటనే అరికట్టాలి. ఇది వివక్షతో కూడిన చర్య. నేను ఐస్‌క్రీమ్ ఎలా తింటే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఎలా ఉండాలనుకుంటే వారిని అలా ఉండనివ్వండి” అని ప్రముఖ టర్కిష్ ఆన్‌లైన్ ఫోరమ్‌ ఎక్సి సొజ్లుక్‌లో ఒకరు పోస్ట్ చేశారు.అమ్మాయిలకే ఇలాంటి కోర్సులు ఎందుకు, అబ్బాయిలు కూడా ఈ పనులన్నీ చేస్తారు కదా అని మరొకరు ప్రశ్నించారు.”ఇదేదో అమ్మాయిలకోసం ఉద్దేశించిన శిక్షణ అనే భావన కల్పించాలని అనుకోవట్లేదు. నలుగురిలో ఉన్నప్పుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా నడుచుకోవడం అందరి బాధ్యత. మన చుట్టూ ఉన్న అమ్మాయిలకు అదే మేము చెబుతున్నాం” అని ఈ కోర్సును నిర్వహిస్తున్న అర్జు అర్డా వివరించారు.అయితే ఈ సలహాపై కొందరు సానుకూలంగా కూడా స్పందించారు. “ఇలాంటి పద్ధతులు అన్నిచోట్లా పాటిస్తే ఇస్తాంబుల్ అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మారుతుంది” అంటూ అర్జు అర్డాకు మద్దతు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos