తెలంగాణలో 24 గంటలు…

తెలంగాణలో 24 గంటలు…

హైదరాబాద్‌ : తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాకుండా, ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ పాటిద్దామని చెప్పారు. రేపు ఆర్టీసీ బస్సు సేవలను నిలిపివేస్తున్నామని, మెట్రో సేవలు సైతం మూసివేస్తున్నామని చెప్పారు. అంతర్రాష్ట్ర బస్సులను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కరోనాపై తెలంగాణ పోరాడుతోంది. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 20 వేలమంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారు. నిన్న ఒక్కరోజే 1500 మంది వచ్చారు. ఇప్పటి వరకు 11 వేల మందిని అధీనంలోకి తీసుకున్నాం. వచ్చిన వారంతా విదేశాల ద్వారా వస్తున్నారు. అలాంటి వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నాం. మరికొందరు వేరే రాష్ట్రాలకు వచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలోకి వస్తున్నారు. అలాంటి వారిని గుర్తించడానికి 5,274 పరిశీలన బృందాలు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో 21 మందికి కరోనా పాజిటివ్‌ ఉంది. 700 మందికి ఈ లక్షణాలు కనిపించాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులు, 78 మంది జాయింట్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశాం. ఆరోగ్య మంత్రి ఆధ్వర్యంలో ఐదుగురితో కూడిన నిపుణుల బృందం ఏర్పాటు చేస్తున్నాం. 24 గంటలు పాటిద్దాం. జనతా కర్ఫ్యూలో తెలంగాణ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలవాలి. ప్రధాని పిలుపునిచ్చినట్టే కర్ఫ్యూను పాటిద్దాం. అయితే తెలంగాణలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు 24 గంటల పాటు కర్ఫ్యూలో పాల్గొందాం. రాష్ట్రం సాధించిన స్ఫూర్తితో కర్ఫ్యూలో పాల్గొనాలి. ఆర్టీసీ బస్సులు నూరు శాతం ఆపేస్తున్నాం. అత్యవసర సేవల కోసం ప్రతి డిపోలో 5 బస్సులు సిద్ధం చేశాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు కూడా రానివ్వం. మెట్రో రైళ్లు సైతం ఆగిపోతున్నాయి. అత్యవసరాల కోసం ఐదు రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. షాపులు, మాల్స్‌ కూడా స్వీయ నిర్బంధం పాటించాలి. ఎమర్జెన్సీ సిబ్బంది మినహా మిగిలిన వారంతా ఈ కర్ఫ్యూలో పాల్గొంటారు. మన కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం కర్ఫ్యూలో పాల్గొందాం. నియంత్రణ పాటించకపోవడంతో ఆయా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణకు భయం పొంచి ఉంది. సుదీర్ఘ సరిహద్దు కలిగి ఉన్న నేపథ్యంలో సరిహద్దును మూసివేసే యోచనలో ఉన్నాం. తీవ్రత మేరకు నిర్ణయం తీసుకుంటాం. ఆస్పత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోల్‌ బంకులు, మీడియా సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నాం. 60 ఏళ్ల పైబడ్డవారు, 10 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులు రెండు మూడు వారాల పాటు బయటకు రాకూడదు. ప్రపంచ వ్యాప్తంగా వీళ్లలోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. నిన్నటి మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎంబీకి పరీక్షలకు అనుమతివ్వాలని కోరాం. అందుకు అనుమతి లభించింది. తీవ్రత పెరిగితే వెయ్యి మంది వరకు పరీక్షలు చేసే సామర్థ్యం సీసీఎంబీకి ఉంది. ప్రభుత్వం ఎన్నికోట్లైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. పని మనుషులకు రేపు సెలవివ్వాలని ధనవంతుల్ని కోరుతున్నా. రేపు సాయంత్రం ఐదు గంటలకు అందరూ చప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలియజేయాలి’ అని ఆయన వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos