హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో లీజింగ్‌

హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో లీజింగ్‌
హైదరాబాద్‌ .: దేశవ్యాప్తంగా నివాస గృహాల కంటే కార్యాలయాల వసతి లీజుకు గిరాకీ పెరుగుతోంది. గత ఏడాది (2018) దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 4.69 కోట్ల చదరపు అడుగుల (ఎస్‌‌‌‌ఎ‌‌‌‌ఫ్‌‌‌‌టీ) ఆఫీసు స్థలాన్ని వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రియల్టీ మార్కెట్‌ తీరుతెన్నులను గమనించే నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సంస్థ తన తాజా ‘ఇండియా రియల్‌ ఎస్టేట్‌’ నివేదికలో ఈ విషయం పేర్కొంది.

పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌‌‌‌టీ, రెరాతో 2017లో పడకేసిన రియల్టీ రంగం, 2018లో కొద్దిగా కోలుకుంది. ఈ సంవత్సరం మొత్తం మీద దేశవ్యాప్తంగా నివాస గృహాల అమ్మకాలు ఆరు శాతం పెరిగి 2,42,328 యూనిట్లకు చేరాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా హైదరాబాద్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌ సామ్సన్‌ ఆర్థర్‌ విలేకరులతో చెప్పారు. హైదరాబాద్‌లో వాణిజ్య కార్యాలయాల వసతితో పాటు నివాస గృహాలకు మంచి డిమాండ్‌ కొనసాగుతోందని సామ్సన్‌ ఆర్థర్‌ చెప్పారు. గత ఏడాది (2018) రెండో అర్థ భాగంలో హైదరాబాద్‌, దాని చుట్టు పక్కల కార్యాలయాల వసతి లీజింగ్‌ రికార్డు స్థాయిలో 43 లక్షల చదరపు అడుగు (ఎస్‌‌‌‌ఎ‌‌‌‌ఫ్‌‌‌‌టీ)లకు చేరింది. ఇదేకాలంలో నివాస గృహాల వసతి సరఫరా 54 శాతం, అమ్మకాలు తొమ్మిది శాతం పెరిగాయి.

గత ఏడాది రెండో అర్థ భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్‌ నివాస గృహాల మార్కెట్లో 15 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ కాలంలో మొత్తం 7,278 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. 2018 సంవత్సరం రెండో అర్థ భాగంలో 1700 యూనిట్ల కొత్త ప్రాజెక్టులు ప్రారంభయ్యాయి. అంతకు ముందు సంవత్సరం రెండో అర్థ భాగంతో పోలిస్తే ఇది 81 శాతం ఎక్కువని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా హైదరాబాద్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌ సామ్సన్‌ ఆర్థర్‌ తెలిపారు.

నివేదికలోని ప్రధానాంశాలు
2018 మొత్తం మీద 54 శాతం పెరిగిన కొత్త యూనిట్ల ప్రారంభం
హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలోనే 84 శాతం కొత్త యూనిట్లు
కొత్త ప్రాజెక్టుల్లో 43 శాతం గృహాల ధర రూ.50 లక్షల్లోపు
ఎక్కువ ప్రాజెక్టుల ధర మాత్రం రూ.50-75 లక్షలు
2018 మొత్తం మీద 70 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌
ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఉత్పత్తి రంగ కంపెనీలతో పెరిగిన లీజింగ్‌ గిరాకీ

తాజా సమాచారం

Latest Posts

Featured Videos