స్వైన్ ఫ్లూ .. జాగ్ర‌త్త‌లు

స్వైన్ ఫ్లూ .. జాగ్ర‌త్త‌లు

దేశంలోని అనేక ప్రాంతాల్లో రోజు రోజుకీ స్వైన్ ప్లూ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా విడుద‌ల చేసిన స‌మాచారం ప్ర‌కారం.. రాజ‌స్థాన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1911 స్వైన్ ఫ్లూ కేసులు న‌మోద‌వ్వ‌గా 75 మంది ఈ వ్యాధి కార‌ణంగా మ‌రణించారు. అలాగే గుజ‌రాత్‌లో 600 కేసులు న‌మోద‌వ‌గా 24 మంది మృతి చెందారు. ఇక ఢిల్లీ ఈ విష‌యంలో 3వ స్థానంలో ఉంది. అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు 532 స్వైన్ ఫ్లూ కేసులు న‌మోద‌య్యాయి. కానీ ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కార‌ణంగా ఎవ‌రూ మృతి చెందిన‌ట్లు తెలియ‌లేదు. పంజాబ్‌లో 174 కేసులు 27 మ‌ర‌ణాలు న‌మోదు కాగా, హ‌ర్యానాలో 372 కేసులు 8 మ‌ర‌ణాలు, మ‌హారాష్ట్ర‌లో 82 కేసులు, 12 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో రోజు రోజుకీ స్వైన్ ఫ్లూ బారిన ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతుండ‌గా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాలతో స‌మావేశాలు నిర్వ‌హించింది. స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్దార‌ణను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్టాల‌ని, హాస్పిట‌ళ్ల‌లో ప‌డ‌కలు అందుబాటులో ఉంచాల‌ని సూచించింది. ఇక స్వైన్ ఫ్లూను రాకుండా చూసుకునేందుకు వైద్యులు కూడా ప‌లు సూచ‌న‌లు, జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని చెబుతున్నారు. 

1. స్వైన్ ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) వ్యాధి అంటు వ్యాధి. ఇది ఒక‌రి నుంచి ఒక‌రికి తుమ్మిన‌ప్పుడు, ద‌గ్గున‌ప్పుడు లేదా స్ప‌ర్శ కార‌ణంగా వ‌స్తుంది. అలాగే స్వైన్ ఫ్లూ ఉన్న‌వారు తాకిన వ‌స్తువుల‌ను ఇత‌రులు తాకితే వారికి ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా టెలిఫోన్లు, సెల్‌ఫోన్లు, కంప్యూట‌ర్లు, డోర్ హ్యాండిల్స్‌, డోర్ బెల్స్‌, పెన్నులు త‌దితర వస్తువుల‌ను వాడ‌డంతోపాటు క‌ర‌చాల‌నం వ‌ల్ల కూడా ఈ వైర‌స్ ఒక‌రి నుంచి ఒక‌రికి వ్యాప్తి చెందుతుంది. క‌నుక ఈ విషయాల్లో ఎవ‌రైనా జాగ్ర‌త్త పాటించాలి. 2. ఎదుటి వారు ద‌గ్గిన‌ప్పుడు లేదా తుమ్మిన‌ప్పుడు తప్ప‌నిస‌రిగా హ్యాండ్ క‌ర్చీఫ్ లేదా మాస్క్‌తో ముక్కు, నోరును క‌వ‌ర్ చేసుకోవాలి. 3. ద‌గ్గు, జ‌లుబు రెండు నుంచి మూడు రోజుల క‌న్నా ఎక్కువ స‌మ‌యం పాటు ఉంటే క‌చ్చితంగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. స్వైన్ ఫ్లూ వ‌చ్చిన వారిలో జ్వ‌రం, గొంతు నొప్పి, ఒళ్లునొప్పులు, ద‌గ్గు, జ‌లుబు, వాంతులు అవ‌డం, వణుకు ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. 4. చేతుల‌ను త‌ర‌చూ స‌బ్బు లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇవి అందుబాటులో లేక‌పోతే క‌నీసం హ్యాండ్ శానిటైజ‌ర్ల‌ను అయినా వాడాలి. 5. జ‌న స‌మూహం ఎక్కువ‌గా ఉన్న చోట క‌చ్చితంగా నోరు, ముక్కుకు అడ్డంగా మాస్క్ ధ‌రించాలి. వీలైనంత వ‌ర‌కు వేడిగా ఉండే ఘ‌న లేదా ద్రవ ఆహారాల‌ను తీసుకోవాలి. 6. ఆహారంలో విట‌మిన్ సి ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారం తినాలి. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos