శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

తిరువనంతపురం, జనవరి 13: మకర సంక్రాంతిని పురస్కరించుకుని.. శబరిమలలో మకరజ్యోతి (మకరవిళక్కు) దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ట్రావన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. జ్యోతి దర్శనం సందర్భంగా పంపానది వద్ద, సన్నిధానం, హిల్‌టాప్‌, టోల్‌ప్లాజా సమీపంలో చేసిన ఏర్పాట్లను టీడీబీ అధ్యక్షుడు పద్మకుమార్‌ వివరించారు. రెండురోజుల క్రితం పందళం నుంచి బయలుదేరిన అయ్యప్పస్వామి తిరువాభరణాలను.. సోమవారం సాయంత్రం 6 గంటలకు శబరిమలలోని పవిత్ర పద్దెనిమిది మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుస్తామన్నారు. సరిగ్గా 6.30 గంటలకు దీపారాధన కార్యక్రమంతో పాటు, స్వామికి దివ్యాభరణాలు ధరింపజేసే ‘తిరువాభరణ’ ఘట్టం నిర్వహిస్తామన్నారు. అదేసమయంలో.. పొన్నంబల మేడు నుంచి ఆ హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి జ్యోతిరూపంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. మకరజ్యోతి దర్శనానికి తరలివచ్చే లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. భక్తులు ఈ నెల 19వతేదీ వరకు శబరిగిరీశున్ని దర్శించుకోవచ్చన్నారు. 20న పందళ రాజవంశీకులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయాన్ని మూసివేస్తామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos