పురిటిలోనే వివక్షా పుట్టింది!

దేవరకొండ మరో మగబిడ్డ కోసం ప్రయత్నించారు. పదో కాన్పులో ఆడబిడ్డ పుట్టిందని తెలియగానే కనీసం పాలు కూడా పట్టించకుండా వదిలించుకునే ప్రయత్నం చేశారు. ఈ హృదయ విదారక ఘటనకు నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రి వేదికైంది. నల్గొండ జిల్లా చందంపేట మండలం మోత్య తండాకు చెందిన ఇస్లావత్‌ సావిత్రి, రాజు దంపతులకు ఇప్పటికే ఆరుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. మంగళవారం ఉదయం సావిత్రి దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో పదో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరుక్షణం నుంచే సంబంధీకులు వివక్షను ప్రదర్శించడం ఆరంభించారు. అమ్మమ్మ రాములమ్మ శిశువు వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తున్నా పాలు పట్టేందుకు తల్లి ముందుకు రాలేదు. ఇక తండ్రి సంగతి సరేసరి. ఇరుగుపొరుగు బాలింతలు, గర్భిణులు పాలు పట్టాలంటూ సూచించినా వాళ్లు చలించ లేదు. చివరికి వాళ్లే పోతపాలు పట్టి బిడ్డ ఆకలి తీర్చారు.
శిశువు విక్రయానికి ప్రణాళిక
ఇదంతా ఒక ఎత్తయితే గుట్టుచప్పుడు కాకుండా ఆడ శిశువును ఇతరులకు అప్పగించేందుకు దంపతులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనే సమాచారంతో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ వెంకటమ్మ ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. శిశువుకు హాని తలపెట్టినా, శిశువు అదృశ్యమైనా మానవ అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేస్తామని బిడ్డ తండ్రి రాజును హెచ్చరించారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసు నమోదు చేసుకోండి. ఇంకా ఏమైనా చేసుకోండి’ అంటూ సూపర్‌వైజర్‌ వెంకటమ్మతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో బిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు అంగీకరించాడు.
మరో ఇద్దరు ఏమయ్యారు?
నేరడుగొమ్ము మండలం మోసంగడ్డ తండాలో సోనియా, బాలు దంపతులకు ఇటీవల రెండో కాన్పులో పుట్టిన ఆడబిడ్డ అదృశ్యమైనట్టు ఐసీడీఎస్‌ అధికారులకు ఫిర్యాదు అందింది. శనివారం ఆడ శిశువును దంపతులు వదిలించుకున్నట్లు సమాచారం. ఇదే మండలం ఉస్మాన్‌కుంటలో జటావత్‌ జయ, భద్రు దంపతులకు మూడో కాన్పులో పుట్టిన ఆడ శిశువు కొన్నాళ్లుగా కన్పించడం లేదు. రెండు ఘటనలపై విచారణ చేపడుతున్నామని సూపర్‌వైజర్‌ వెంకటమ్మ తెలిపారు. ‘ఇటీవలి కాలంలో ఇలాంటి మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. దత్తత, రిజిస్ట్రేషన్ల పేరిట హైదరాబాద్‌లో ముఠా పనిచేస్తోందన్న అనుమానాలున్నాయి. ఈ ముఠా ద్వారా శిశువుల విక్రయం జరుగుతున్నట్టు అనుమానిస్తున్నాం’ అని వివరించారు. విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos