నేడు ముగియనున్న జగన్‌ పాదయాత్ర

అమరావతి: వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర తుది అంకానికి చేరింది. ఇడుపులపాయలో 2017 నవంబరు 6న ప్రారంభమైన ఈ పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. మొత్తం 341 రోజుల్లో ఆయన సుమారు 3,648 కిలోమీటర్లు నడిచారు. ‘అన్న వస్తున్నాడు.. మంచి రోజులొస్తున్నాయి’ అంటూ మొత్తం 13 జిల్లాల మీదుగా జగన్‌ పాదయాత్ర కొనసాగించారు. నగర, పట్టణ, గ్రామీణ, కొన్ని మారుమూల ప్రాంతాల్లోనూ ఆయన ప్రజలను కలుస్తూ వారి కష్ట, నష్టాలను తెలుసుకుంటూ ‘వచ్చేది మన ప్రభుత్వం.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం’ అని భరోసానిస్తూ ముందుకు కదిలారు. పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతూనే… అక్కడక్కడా బహిరంగ సభల్లో ప్రసంగించారు. వివిధ సామాజిక వర్గాలు, కులవృత్తుల వారితో ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. ఆయా సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని, నిధులను కేటాయిస్తామని హామీలిచ్చారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వైకాపా ప్రధాన హామీలైన నవరత్నాల గురించి బహిరంగ సభల్లో వివరించారు.
ముగింపు సభ నేడు
పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభను వైకాపా నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు. ఇచ్ఛాపురానికి ఒకటిన్నర కిలోమీటర్ల ముందు ఏర్పాటు చేసిన పాదయాత్ర విజయ స్తూపాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అక్కడినుంచి బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.
ఇడుపులపాయలో ప్రారంభం.. అక్కడే సమాప్తం
జగన్‌ 2017 నవంబరు 5న తిరుమలతో శ్రీవారిని దర్శించుకుని, ఇడుపులపాయకు వచ్చి పాదయాత్ర ప్రారంభించారు. ఇచ్ఛాపురంలో బుధవారం పాదయాత్ర, సభ ముగిశాక.. ఆయన రాత్రికి విజయనగరం చేరుకుంటారు. అక్కడ్నుంచి రైల్లో తిరుపతికి వెళతారు. గురువారం ఉదయం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు. 11న ఉదయం తిరుమల నుంచి నేరుగా కడప చేరుకుని పెద్ద దర్గాను దర్శించుకుంటారు. తర్వాత పులివెందులలో చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. చివరగా ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుని అక్కడ వైఎస్‌ సమాధివద్ద నివాళినర్పిస్తారు. దీంతో ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తిరిగి అక్కడే సమాప్తమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos