కెరీర్ లో 31 సినిమాలు తీసినా ది బెస్ట్ మాత్రం అదే

  • In Film
  • January 25, 2019
  • 717 Views
కెరీర్ లో 31 సినిమాలు తీసినా ది బెస్ట్ మాత్రం అదే

ఎఫ్2 సినిమా సక్సెస్ తో ఊపుమీదున్న దిల్ రాజు గ్రేట్ ఆంధ్రతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు. ఈ సందర్భంగా ఎఫ్2 సక్సెస్ తో పాటు ఓవరాల్ గా తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాల్ని దర్శకుడు అనీల్ రావిపూడితో కలిసి పంచుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లోనే ఎఫ్2 సినిమా అతిపెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. కానీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ మాత్రం ఎఫ్2 కాదంటున్నాడు దిల్ రాజు.

“నేను ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ ప్లేస్ బొమ్మరిల్లుకే ఇస్తాను. ఎందుకంటే ఆ సినిమా కుటుంబాలు కుటుంబాల్ని కదిలించేసింది. సక్సెస్, డబ్బు అనే విషయాల్ని పక్కనపెడితే ప్రేక్షకుల్ని బాగా పట్టేసింది. ఇప్పటికీ ఓ 10 మంది ప్రేక్షకులతో మాట్లాడుతుంటే, వాళ్లలో ఒక్కరైనా బొమ్మరిల్లు గురించి మాట్లాడతారు. అలా కనెక్ట్ అవుతారు. 13 ఏళ్లయినా ఇప్పటికీ అదే నా బెస్ట్ ఫిలిం.”

ఈ సందర్భంగా తన కెరీర్ బెస్ట్ సినిమాల్ని కూడా చెప్పుకొచ్చాడు. 31 సినిమాలు తీసినా ఓ అరడజను సినిమాలు మాత్రమే తనకు తృప్తినిచ్చాయంటున్నాడు దిల్ రాజు.

“నేను తీసిన 31 సినిమాల్లో నాకు నచ్చిన సినిమాలు కొన్నే. ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, మిస్టర్ పెర్ ఫెక్ట్, బృందావనం, ఎఫ్2, శతమానం భవతి సినిమాలు నా కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్స్. వీటిలో కూడా నంబర్ వన్ స్థానం ఇవ్వాలంటే బొమ్మరిల్లుకే ఇస్తా.”

నిర్మాతగా సినిమా నిర్మించడం కంటే ఓ డిస్ట్రిబ్యూటర్ గా సినిమాను పంపిణీ చేయడం చాలా కష్టం అంటున్నాడు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ అంత రిస్క్ జాబ్ ఈ ప్రపంచంలోనే లేదంటున్నాడు. ఒకేసారి 2 పెద్ద సినిమాల్ని పంపిణీ చేయాల్సి వచ్చినప్పుడు సొంత సినిమాను కూడా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

2 పెద్ద సినిమాల్ని ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇబ్బందులు తప్పవు. 2017లో నాకు ఆ ఇబ్బంది వచ్చింది. శతమానంభవతి నా సినిమా. దాంతో పాటు ఖైదీనంబర్ 150 పంపిణీ చేయాల్సి వచ్చింది. శతమానంభవతి చిన్న సినిమా కాబట్టి థియేటర్ల విషయంలో మేనేజ్ చేయగలిగాను.

కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఎఫ్2 పెద్ద సినిమా. దీనికి తోడు వినయవిధేయరామ సినిమాను కూడా నేను రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో నా సినిమాను కూడా పట్టించుకోలేదు. ఎఫ్2కు థియేటర్లు తగ్గించి, వినయ విధేయ రామకే ఇచ్చాం.

అయితే జానర్ పరంగా ఎఫ్2 సినిమాను కాంపాక్ట్ రిలీజ్ చేయడం పెద్ద ప్లస్ అయిందన్నాడు దిల్ రాజు. ఇప్పటికీ స్టడీగా సినిమా కొనసాగడానికి ఈ కాంపాక్ట్ రిలీజ్ పద్ధతే కారణమని విశ్లేషించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos