కస్టమర్లకు లాభం

  • In Money
  • January 28, 2019
  • 128 Views
కస్టమర్లకు లాభం

బెంగళూరు, జనవరి 27: దేశీయ ఈ-కామర్స్ రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రాకను ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్ పాయ్ స్వాగతించారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఆన్‌లైన్ మార్కెట్‌లోకి రావడం వల్ల వినియోగదారులకు పెద్ద ఎత్తున లాభమని అభిప్రాయపడ్డారు. ఆయా ఉత్పత్తుల ధరలు మరింత తగ్గవచ్చునన్న ఆయన.. విదేశీ సంస్థల ఆధిపత్యానికీ బ్రేకులు పడవచ్చునని అంచనా వేశారు. అన్ని విధాలుగా బలంగా ఉన్న రిలయన్స్ రాకతో డిజిటల్ రంగంలో గొప్ప మార్పులే కనిపించవచ్చు. విదేశీ సంస్థల ప్రాబల్యం తగ్గిపోవచ్చు. పోటీ పెరిగి వినియోగదారులకు లాభం చేకూరుతుంది అని పీటీఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాయ్ అన్నారు. రిలయన్స్ నిజంగా బలమైన సంస్థ. పెట్టుబడి, సాంకేతికత, నెట్‌వర్క్స్, ఔట్‌లెట్లు, దూరదృష్టి వంటి అంశాల్లో ఏ సంస్థకైనా గట్టి పోటీనివ్వగలదు అన్నారు.

జియోతో చక్కని అవకాశం

ఆన్‌లైన్ మార్కెట్‌లోకి రావాలన్న ముకేశ్ అంబానీ ఆలోచనకు జియో ఊతమివ్వగలదని పాయ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దేశీయ టెలికం రంగంలో 4జీ సేవలతో రిలయన్స్ జియో సృష్టించిన సంచలనాలు తెలిసిందే. ఇంటర్నెట్‌ను అందరి చెంతకు చేర్చిన ఘనత జియోదేనంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. దేశవ్యాప్తంగా జియో సేవలు అందుబాటులో ఉండగా, ఇంటర్నెట్ ఆధారిత ఈ-కామర్స్ మార్కెట్‌లోకి రిలయన్స్ వస్తే.. దేశ ఆన్‌లైన్ మార్కెట్ స్వరూపం కూడా మారిపోగలదని పాయ్ అన్నారు. జియోకున్న వినియోగదారుల సంఖ్య రిలయన్స్ ఆన్‌లైన్ కొనుగోళ్లకూ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవలి వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. భారత్‌ను విదేశీ సంస్థల చేతుల్లో పెట్టకూడదు అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్‌లైన్-టు-ఆఫ్‌లైన్ వేదిక ఏర్పాటు యోచనలో ఉన్నామని చెప్పిన సంగతీ విదితమే.

ప్రత్యర్థులకు గట్టి పోటీనే

నానాటికి వృద్ధి చెందుతున్న భారతీయ రిటైల్ మార్కెట్‌లో ఆన్‌లైన్ వ్యాపారం వాటా అంతాఇంతా కాదు. అమెజాన్, వాల్‌మార్ట్ తదితర విదేశీ సంస్థల పెత్తనం ఎక్కువైపోతున్న తరుణంలో రిలయన్స్ వంటి దిగ్గజం రాక మొత్తం ఈ-కామర్స్ మార్కెట్ ముఖచిత్రాన్నే మార్చివేయగలదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చైనా ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం అలీబాబా మాదిరి సంస్థ రిలయన్స్ కాగలదన్న అంచనాలూ వ్యక్తమవుతున్నదీ విదితమే. ఈ క్రమంలో రిలయన్స్ రాకతో ముఖ్యంగా సరఫరా వ్యవస్థ బలపడుతుందని, చిన్నచిన్న గ్రామాలకూ ఆన్‌లైన్ మార్కెట్ విస్తరించే అవకాశాలున్నాయంటున్నారు పాయ్. ఇప్పటికే భారీ డిస్కౌంట్లతో తీవ్ర పోటీ ఉన్న ఆన్‌లైన్ మార్కెట్‌లోకి రిలయన్స్ వస్తే మరిన్ని రాయితీలకు దారితీయవచ్చునని, ధరలు పడిపోయి, కస్టమర్లకు విపరీతమైన లాభం చేకూరే వీలుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos