విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరి

విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరి

విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మాట్లాడకుండా మౌనం వహించి ఆ తరువాత పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటానని లోపాయికారిగా చెప్పడం మోసకారితనం తప్ప మరొకటి కాదు అన్నారు. పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు సంవత్సరం క్రితం ఇంటర్వూ కోరితే ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోసం వారిని ఈరోజు పిలిపించుకొని మాట్లాడటంలో నిజాయితీ లేదని స్పష్టం చేశారు. కనీసం వారిని కలిసిన సందర్భంలోనైనా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపేందుకు తాను నిలబడతానని మాటమాత్రంగానైనా చెప్పలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న గనులను కేటాయించేందుకు కూడా హామీ ఇవ్వలేదని అన్నారు. ఈ మూడేళ్ళలో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా ఒక్కసారి కూడా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని ప్రధానిని సిఎం జగన్‌ అడిగిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రధాని విశాఖకు వచ్చిన సందర్భంలో కూడా ఆయనకు కనీసం అర్జీ కూడా ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం కార్మికులను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రకటన చేయడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపికి భయపడి విశాఖ ఉక్కును ఫణంగా పెట్టడం దారుణమని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు విషయంలో వైసిపి, టిడిపి, జనసేనలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయన్నారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరిస్తున్న బిజెపికి మూడు పార్టీలూ మద్దతునిస్తూ మరోవైపు పోరాడుతున్న కార్మికుల పక్షం తామున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇప్పటికైనా వీరి అసలు రంగును గర్తించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్న వామపక్షాలను ఆదరించాలని వి.శ్రీనివాసరావు కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos