యూపీఎస్సీ పరీక్షల్లో రాణిస్తున్న ముస్లింలు

యూపీఎస్సీ పరీక్షల్లో రాణిస్తున్న ముస్లింలు

న్యూఢిల్లీ : భారత్లో మైనారిటీలుగా ఉన్న ముస్లింలు పలు రంగాల్లో వెనకబడి ఉన్నారు. సరైన విద్య అందకపోవటం, ఆర్థిక సమస్యల కారణంగా వారు ఉన్నత స్థానాలకు చేరుకోవటం చాలా కష్టంగా మారుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ముస్లింలు భారత్లోనే అత్యంత కఠినమైన యూపీఎస్సీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. గట్టి పట్టుదలతో సివిల్స్ పరీక్షలు, ఇంటర్వూలలో రానిస్తూ దేశంలో ఉన్నతోద్యోగాలకు ఎంపికవుతున్నారు. మైనారిటీలలో తమ లాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మూడ్రోజుల క్రితం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ముస్లింలు 50 మందికి పైగా ర్యాంకులు సాధించటమే దీనికి నిదర్శనం. 14 ఏండ్ల క్రితం షా ఫైసల్ యూపీఎస్సీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నప్పుడు.. ఆ సమయంలో యావత్ ముస్లిం సమాజం గర్వపడింది. ఆ వర్గంలోని విద్యార్థులు, యువతను సివిల్స్ వైపునకు అడుగు వేసేలా షా ఫైసల్ టాప్-1 ర్యాంకు దోహదం చేసిందనీ, ప్రస్తుత పరిస్థితులూ ఈ వర్గం వారిలో మరింత ఆలోచనలను కలిగిస్తాయని మేధావులు, సామాజిక విశ్లేషకులు అంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి ఉన్నతమైన ఉద్యోగాల కోసం ప్రతి ఏడాదీ యూపీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత కష్టతరమైన పోటీ పరీక్షలలో ఒకటి. ఈ సారి వెలువడిన ఫలితాల్లో 50 మందికి పైగా ముస్లింలు ర్యాంకులు సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 70 శాతం ఎక్కువ. నౌషీన్ (ఆల్ ఇండియా ర్యాంక్ 9), వార్దా ఖాన్ (18), జుఫిషన్ హక్ (34), ఫాబీ రషీద్ (71)లు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ) 2023 మెరిట్ జాబితాలో మొదటి 100 మందిలో ఉన్న నలుగురు కావటం గమనార్హం.2022లో ఈ సంఖ్య 29, 2021లో 25గా ఉన్నది. దీంతో 2023 జాబితాలో ముస్లిం ప్రాతినిధ్యంలో పెరుగుదల కనిపించటం గమనార్హం. ”వారు(ముస్లింలు) ఇప్పటికీ స్థూలంగా తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది వారి జనాభా నిష్పత్తికి కూడా సరిపోలటం లేదు. ఏదైనా ‘మైనారిటీ’.. సివిల్ సర్వీసెస్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటే అది మాత్రం ముస్లింలు కాదు.. జైనులు” అని విద్యావేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజేందర్ చౌహాన్ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో 20 సంవత్సరాలకు పైగా యూపీఎస్సీ ఆశావాహులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
మంగళవారం విడుదల చేసిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెరిట్ 2023 ప్రకారం.. మొత్తంగా మొత్తం 1,016 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇతర శాఖల్లోకి నియామకం కోసం ఎంపికయ్యారు. గత మూడేండ్లలో సీఎస్ఈ ఖాళీలు స్వల్పంగా పెరగటం గమనార్హం. 2021లో పోస్టుల సంఖ్య 712 కాగా, 2022లో 1022కి, 2023లో 1,016కి పెరిగింది.
మైనారిటీలలో పరీక్ష గురించి అవగాహన ఉన్నందున, హాస్టల్స్, స్టడీ మెటీరియల్, కోచింగ్ క్లాస్లను అందించటం ద్వారా విద్యార్థులకు సహాయం చేయటానికి కమ్యూనిటీలు ముందుకు వస్తున్నాయని మేధావులు అంటున్నారు.కాగా, 2023 యూపీఎస్సీ నియామకాల్లో జైన్ వర్గం ప్రాతినిధ్యం కూడా పెరుగుతున్నదని తుది ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఈ జాబితాలో వారి సంఖ్య 12 మందిగా ఉన్నారు. అయితే, ముస్లింల ప్రాతినిధ్యం పెరుగుతున్నదని చెప్పటానికి ఈ డేటా సరిపోదని సివిల్ సర్వీస్ కోచింగ్ రంగ నిపుణులు అంటున్నారు. ”ముస్లింలకు ఉద్యోగాలు రావు, పెద్ద వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని పూర్వం ప్రజలు భావించేవారు. ఈ అపోహ తగ్గుతున్నది. కానీ దామాషా ప్రకారం ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నది” అని స్వచ్ఛందంగా కోచింగ్లు నిర్వహించే ఫౌండేషన్లు తెలుపుతున్నాయి. భారతజనాభాలో ముస్లిం అభ్యర్థులు.. వారి వాటాను బట్టి చాలా తక్కువ అని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ” దేశంలో జైనుల జనాభా 0.4 శాతం. ఆ గణన ప్రకారం జైనుల నిష్పత్తికి సరిపోయేలా 480 మంది ముస్లింలు ఉండాలి. దేశంలో ముస్లిం జనాభాను బట్టి చూస్తే.. 1,016 మంది అభ్యర్థులలో 51 మంది అభ్యర్థులు తక్కువే” అని వివరిస్తున్నారు. ”మొత్తం 1016 మందికి గానూ 51 మంది ముస్లింలు మాత్రమే ఈ సంవత్సరం అర్హత సాధించారు. అంటే ఈ సంఖ్య 5 శాతమే. భారత్కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ యూపీఎస్సీ ఎంపిక జాబితాలో 14 శాతం ముస్లింలు లేరని గుర్తుంచుకోవాలి” అని మేధావులు విశ్లేషిస్తున్నారు.
హిందూత్వ శక్తుల ద్వేషం
యూపీఎస్సీలో ముస్లింల ప్రదర్శన ఈ సారి కాస్త పెరగటంపై కొన్ని హిందూత్వ శక్తులు విషం చిమ్ముతున్నాయి. ప్రజల్లో ద్వేషాన్ని రగిలిస్తూ, హిందూత్వ అజెండాగా పని చేసే సుదర్శన్ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్ సురేశ్ చవాన్కే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ముస్లింలు రానిస్తుండటంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. నాలుగేండ్ల క్రితం చవాన్కే ‘యూపీఎస్సీ జిహాద్’పై ఒక ఎపిసోడ్తో ముందుకొచ్చారు. ముస్లింలను భారతీయ సివిల్ సర్వీసెస్లోకి చొప్పించే కుట్ర అని ఆ ఎపిసోడ్లో ఆరోపించారు. ఆ సమయంలో ఆయన ఛానెల్పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతే వచ్చింది. కేంద్రం కూడా ఆ ఎపిసోడ్ను తప్పుబట్టక ఏర్పడని పరిస్థితి వచ్చింది. ఆ ఎపిసోడ్ను ఆక్షేపనీయమైనదిగా పేర్కొంటూ ఆ సమయంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ను కూడా దాఖలు చేసింది మోడీ సర్కారు. అయితే, ఈ సారి యూపీఎస్సీ పరీక్షల్లో ముస్లింలు 51 మంది ఎంపికయ్యారనీ, గతంలో 29 మంది, అంతకముందు 25 మంది, ఆ తర్వాత ఇంకెంత మందో? అని చవాన్కే ట్వీట్ చేయటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos