ప్రకృతి అందాల సిరి ఎలగిరి..

  • In Tourism
  • September 14, 2019
  • 249 Views
ప్రకృతి అందాల సిరి ఎలగిరి..

తమిళనాడు రాష్ట్రంలో ఊటీ,కొడైకెనాల్ తరువాత వెల్లూరు జిల్లాలోని ఎలగిరి ప్రముఖ పర్యటక ప్రాంతంగా విరాజిల్లుతోంది.తమిళనాడులోని ఇతర హిల్‌స్టేషన్స్‌కు భిన్నంగా ఎలగిరి పర్యాటకులకు ఏకాంత ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుంది.సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉండే ఎలగిరి హిల్ స్టేషన్ పళ్ల సువాసనలు,పచ్చదనం,నిశ్శబ్దంగా ఉండే పరిసరాలు,పక్షుల కిలకిల రాగాలతో మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. పళ్ళతోటలు, గులాబి తోటలు, పచ్చటి లోయలు ఎలగిరి మరో ప్రత్యేకత.రెండు ఎత్తైన కొండల మధ్య 14 చిన్నచిన్న గ్రామాల సమూహంతో కలసి ఉన్న ఎలగిరిలోని పచ్చని లోయలు, మైదానాల గుండా ప్రయాణించడం మధుర అనుభూతిగా మిగిలిపోతుంది.వేలవన్ దేవాలయం, స్వామిమలై కొండ, జవడి హిల్స్ , పలమతి హిల్స్ లాంటి పర్వత ప్రాంతాలు పర్వతారోహణ వంటి అనేక దర్శనీయ ప్రదేశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి.ఇక్కడి నుండి పచ్చటి లోయలను చూస్తే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేనిది. ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే సాహసీకులకు ఎలగిరి ఎంతో అనువైన ప్రదేశం.ఇక్కడ సహజమైన పార్కులు ప్రభుత్వ హెర్బల్, ఫ్రూట్స్ గార్డెన్స్ ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి.ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన పారాగ్లైడింగ్,రాక్ క్లైంబింగ్ కోసం ఎక్కడెక్కడి నుంచి పర్యాటకులు ఎలగిరికి వస్తుంటారు. ఎలగిరిలో ముఖ్యంగా చూడదగిన ప్రాంతాల్లో పుంగనూర్ లేక్ అండ్ పార్క్, న్యేచర్ పార్క్, మురుగన్ టెంపుల్, శివ టెంపుల్, స్వామిమలైన హిల్స్ , మరియు అడ్వెంచర్ క్యాంప్ ముఖ్యమైనవి.చిన్న చిన్న కొండల్లా పరచుకున్న ఇక్కడి పర్వతశ్రేణిలో ఎత్తైనది స్వామిమలై. ఇది 4,338 అడుగుల ఎత్తులో దట్టమైన అడవుల్లో ఉన్న ట్రెక్కింగ్ కోసం చాలా మంది సాహసీకులు వస్తుంటారు.ఎలగిరి ఘాట్ రోడ్డు ప్రారంభమయ్యే మంగళం అనే గ్రామం నుంచి కొంతమంది స్వామిమలైని అధిరోహిస్తుంటారు. ఎలగిరిలోని పాలమర్తి, జావడి కొండల్లో కూడా కొందరు ట్రెక్కింగ్ చేస్తుంటారు.విషపూరిత పాములకు నివాస ప్రాంతం కావడంతో ట్రెక్కింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.రాళ్లతో పాటు చెట్ల పొదలు,కొమ్మలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.ఇక ఎలగిరి హిల్స్లో మరో ముఖ్య ప్రదేశం పుంగనూరు లేక్.కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఈ సరస్సులో నౌకాయానం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.సరస్సు ఒడ్డునే ట్రంపోలిన్, ఆర్చరీ, షూటింగ్… వంటి క్రీడలు కూడా ఆలరిస్తాయి.ఇక్కడ లభించే ప్రకృతి సహజసిద్ధమైన పండ్లు,తేనె ఇతర అటవీఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంటుంది.పుంగనూర్ లేక్ కు సమీపంలో నేచర్ పార్క్ ఉంది. ఈ పార్క్ లో మ్యూజికల్ పౌంటైన్ సాయంత్రం 7 నుండి ప్రారంభం అవుతుంది. ఇక ఇక్కడికి దగ్గరగా ఎలగిరి అడ్వెంచర్ స్పోర్ట్స్ అసోషియేషన్ నిర్వహించే క్రీడల్లో పాల్గొనడం మాత్రం మరచిపోవద్దు.ఎలగిరికి 5 కి.మీ. దూరంలోని అత్తారు నదినీ, 14 కి.మీ. దూరంలో తిరుపత్తూరు దారిలోని జలగంవరై జలపాతం ఉంది. ఇక్కడికి సమీపంలోనే ఆసియాలోనే అతి పెద్ద టెలీస్కోప్ కలిగి ఉన్న కవలూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ నిర్వహిస్తున్న వైనబప్పు అబ్జర్వేటరీ పిల్లలతో పాటు తప్పకుండా తిలకించండి. ఎలగిరిలో మురగన్ (సుబ్రమణ్య) దేవాలయం కూడా మరో ప్రధాన ఆకర్షణ.ఇక్కడ మురుగన్ని కువన్గానూ వల్లీదేవిని కురతిగానూ కొలుస్తారు. జూలై-ఆగస్టుల్లో ఈ గుడిలో జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు వస్తారు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మే మరియు జూన్ నెలల్లో ఇక్కడ సమ్మర్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల్లో జానపద నృత్యాలు,వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు,ఇక్కడి ప్రజల సంస్కృతి,సంప్రదాయలను చూడవచ్చు.స్నేహితులు లేదా కుటుంబంతో కలసి వారంలో రెండు రోజుల విహరించడానికి ఎలగిరి ఎంతో అనువైన పర్యాటక ప్రాంతం.ఎలగిరిలో ఉండడానికి హోటళ్లతో పాటు హోం స్టేలు కూడా అందుబాటులో ఉన్నాయి..
ఇలా చేరుకోవాలి..
బెంగళూరు నుంచి 159,చెన్నై నుంచి 217,తిరుపతి నుంచి 197 కిలోమీటర్ల దూరంలో ఉంది.బెంగళూరు,చెన్నై,తిరుపతి నగరాల నుంచి బస్సు మార్గం ద్వారా వేలూరు పట్టణానికి చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల్లో ఎలగిరి హిల్స్కు చేరుకోవచ్చు.లేదా రైలు మార్గం ద్వారా జోలార్పేట జంక్షన్కు చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల్లో ఎలగిరికి చేరుకోవచ్చు.జోలారుపేట నుంచి ఎలగిరికి కేవలం 25 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండడంతో చాలా మంది జోలార్పేటకు చేరుకొని అక్కడి నుంచి ఎలగిరికి వెళ్లడానికి ఆసక్తి చూపుతారు.

ఎలగిరిలో కొండల్లో ఓ ప్రదేశం..


ఎలగిరిలో కొండల్లో ఓ ప్రదేశం

..


జలగంవరై జలపాతం


ఎలగిరికి చేరుకోవడానికి ఘాట్‌ రోడ్డు


ఎలగిరి కొండలపై అద్భుత దృశ్యం..


పచ్చటి తోటలు


పుంగనూరు సరస్సు..


ప్యారాగ్లైడింగ్‌..


నేచుర్‌ పార్క్‌..


చిరు చినుకుల అందాలతో ఘాట్‌ రోడ్డు..


ఎలగిరి కొండలపై ట్రెక్కింగ్..


ఎలగిరి ప్రకృతి ఒడిలో ఓ కుగ్రామం..


పాలమగి కొండల అందం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos