అమెరికా X ఇరాన్

అమెరికా X ఇరాన్

ఢిల్లీ : మిలిటరీ పరంగా చూస్తే ప్రపంచంలోనే అమెరికా అత్యంత శక్తిమంతమైనది. అందుకే ఆ దేశం ఇతర దేశాలపై ఎప్పుడూ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ చిన్నా చితకా దేశాలను హెచ్చరిస్తూ ఉంటుంది. భయపెడుతుంది కూడా. అయితే చైనా లాంటి దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని సందర్భం చిక్కినప్పుడల్లా సవాలు చేస్తూనే ఉంటాయి. ఇరాన్‌ తొలి నుంచీ అమెరికాకు కంటిలో నలుసులా తయారైంది. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదు. సై అంటే సై అంటూనే ఉంది. అమెరికా మిలిటరీ బలగం ముందు ఇరాన్‌ బలహీనమైనదే అయినా, ఆత్మగౌరవానికి ఆ దేశం పెట్టింది పేరు. తాజాగా అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల సైనిక పాటవాన్ని ఓసారి పరికిద్దాం.
అమెరికా వద్ద ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ఆయుధాలు, సుదూర లక్ష్యాలను తాకగల క్షిపణులు ఉన్నాయి. ఆ దేశానికి ప్రపంచంలోని కీలక ప్రదేశాల్లో వైమానిక స్థావరాలున్నాయి. ఇరాన్ వద్ద మధ్యశ్రేణి క్షిపణలు మాత్రమే ఉన్నాయి. గత కొంత కాలంగా ఇరాన్ సైనికంగా బలోపేతమవుతూ వస్తోంది.


శక్తివంతమైన మిలటరీ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా హతం చేసిన తర్వాత.. పగతో రగిలిపోయిన ఇరాన్.. ఇరాక్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ చర్యపై రేపు స్పందిస్తానని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యాధునికమైన, బలమైన సైనిక సంపత్తి ఉన్న దేశం తమదని ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తుండగా.. అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదని.. తమపై దాడికి దిగితే మాత్రం ధీటుగా బదులిస్తామని ఇరాన్ చెబుతోంది. ఇరాన్లోని 52 ప్రాంతాలను టార్గెట్ చేశామని ట్రంప్ అంటుంటే.. అమెరికాను దెబ్బ తీయడానికి 13 రకాల ప్లాన్లు ఉన్నాయని ఇరాన్ ప్రకటించింది.
గ్లోబల్ ఫైర్ పవర్ అనే అంతర్జాతీయ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2018 నాటి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ను బట్టి ఇరాన్ కంటే అమెరికా ఎంతో శక్తివంతమైన దేశంగా చెప్పొచ్చు. సైనిక శక్తి పరంగా అమెరికా ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉండగా.. ఇరాన్ 14వ స్థానంలో ఉంది.
సైనిక బలగాల సంఖ్య విషయానికి వస్తే అమెరికాకు 21.42 లక్షల సైనిక బలగాలు ఉండగా.. వీరిలో 12.82 లక్షల మంది యాక్టివ్ సోల్జర్స్. అమెరికా రిజర్వ్ మిలిటరీ ఫోర్స్ 8.60 లక్షలుగా ఉంది. కాగా ఇరాన్ మొత్తం సైనిక బలం 8.73 లక్షలుగా ఉంది. వీరిలో 5.23 లక్షల మంది యాక్టివ్ సోల్జర్లు ఉన్నారు. ఇరాన్ రిజర్వ్ మిలిటరీ ఫోర్స్లో 3.50 లక్షల మంది ఉన్నారు.
ఫైటర్ జెట్లు, అటాక్ ఎయిర్క్రాఫ్ట్లు, రవాణా విమానాలు, ట్రైనర్ ఎయిర్క్రాఫ్, హెలికాఫ్టర్లు, అటాక్ హెలికాఫ్టర్లు అన్ని కలిపితే.. అమెరికా వద్ద 13,398 ఎయిర్క్రాఫ్ట్లు ఉండగా.. ఇరాన్ వద్ద 509 మాత్రమే ఉన్నాయి. అమెరికా వద్ద 2,362 ఫైటర్ జెట్లు ఉండగా.. ఇరాన్ వద్ద 142 ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి.
నౌకదళ బలం విషయానికి వస్తే.. అమెరికా నేవీ వద్ద 415 షిప్లు, సబ్మెరైన్లు ఉండగా.. ఇరాన్ వద్ద 398 షిప్లు, సబ్మెరైన్లు ఉన్నాయి. యుద్ధ విమానాలను తీసుకెళ్లగలిగే నౌకలు అమెరికా వద్ద 24 ఉండగా.. ఇరాన్ వద్ద లేవు. అమెరికా వద్ద 68 సబ్మెరైన్లు ఉంటే.. ఇరాన్ దగ్గర 34 సబ్మెరైన్లు ఉన్నాయి. ఇరాన్ వద్ద 88 గస్తీ నౌకలున్నాయి. ఆర్మీ ఆయుధ సంపత్తి విషయానికి వస్తే.. అమెరికా వద్ద 6,287 ట్యాంకులు ఉంటే.. ఇరాన్ వద్ద 1,634 మాత్రమే ఉన్నాయి. ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్ విషయానికి వస్తే.. యూఎస్ దగ్గర 39,223 ఉండగా.. ఇరాన్ దగ్గర 2,345 ఉన్నాయి. సెల్ఫ్ ప్రొఫెల్డ్ ఆర్టిల్లరీ విషయానికి వస్తే అమెరికా వద్ద 992, ఇరాన్ వద్ద 570 ఉన్నాయి.
రక్షణ బడ్జెట్ విషయానికి వస్తే… అమెరికా రక్షణ బడ్జెట్.. ఇరాన్ మొత్తం బడ్జెట్ కంటే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంది. ఇరాన్ దేశ జీడీపీ 440 బిలియన్ డాలర్లు ఉండగా.. అమెరికా రక్షణ బడ్జెట్ 716 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. దేశ రక్షణ కోసం ఇరాన్ ఏటా 6 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos