కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ల అరెస్ట్‌..

కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ల అరెస్ట్‌..

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే జగ్గారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఉదయం నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు నేతలు అనూహ్యంగా ప్రగతి భవన్లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించడంతో అక్కడ పహారా కాస్తున్న పోలీసులు ఇద్దరు నేతలను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బైక్ పై వచ్చిన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు వాహనంలో తరలించారు.దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ నశించాలని నినదించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని, ప్రాణాలు అర్పించిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను సవాల్ చేస్తూ ప్రగతి భవన్ గేట్లను తాకుతామని ఛాలెంజ్ చేసి తాకామని చెప్పారు. రేపు కేసీఆర్ ప్రగతి భవన్ గోడలను 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు. అదే సమయంలో పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు. ఇక్కడి సమీపంలోని ఓ హోటల్కు చేరుకుని, ఓ ఆటోలో ప్రగతి భవన్ కు బయలుదేరారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్ వద్ద నిరసన తెలుపుతామని అన్నారు. న్యాయస్థాన ఆదేశాలను కూడా సర్కారు లెక్కచేయట్లేదన్నారు. ఈ వైఖరితో జనాల్లోకి సర్కారు తప్పుడు సంకేతాలు పంపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos