ఓటు దేశభవిష్యత్తును నిర్ణయిస్తుంది

ఓటు దేశభవిష్యత్తును నిర్ణయిస్తుంది

న్యూ ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్తున్నారు. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రతి ఓటూ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘ఈరోజు తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ప్రతి ఓటూ భారతదేశ ప్రజాస్వామ్య భవితవ్యం, రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బయటకు రండి. మీ శక్తిమంతమైన ఓటుతో ద్వేషాన్ని ఓడించండి. దేశ నలుమూలలా ప్రేమ దుకాణాలను తెరవండి’ అంటూ ఓటర్లకు రాహుల్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడత పోలింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. ఇక తొలి విడత ఎన్నికల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 1491 మంది పురుషులు కాగా, 134 మంది మహిళా అభ్యర్థులు. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos