పెగాసస్ వివాదం: సుప్రీం విచారణ వాయిదా

న్యూ ఢిల్లీ: పెగాసస్ నిఘా వివాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణను ఈ నెల 13వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అధికారులు కొందరు అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ పత్రం తయారీలో ఇబ్బందులు ఎదురైనందున గురువారం వరకూ గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా విన్నవించారు. దీనికి ముందు, జాతీయ భద్రతతో ముడిపడిన అంశమైనందున పబ్లిక్ అఫిడవిట్లో వివరాలు ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నిపుణులతో కూడిన ఇండిపెండెంట్ కమిటీ ముందు అన్ని విషయాలు వెల్లడిస్తామని, ఆ తర్వాత కమిటీ కోర్టుకు నివేదిక అందిస్తుందని తెలిపింది. దీనిపై సీజేఐ ఎన్.రమ ణతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ, తాము చర్చించి, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపింది. గత నెలలో కేంద్రం సమర్పించిన సంక్షిప్త ప్రమాణ పత్రంలో కక్షి దార్లు చేసిన ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. స్వప్రయోజనాలు ఆశించే చేసే తప్పుడు ప్రచారాలను, అపోహలను తొలగించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వివరణ ఇచ్చారని తెలిపింది. పెగాసస్ స్నూపింగ్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాతో సహా పలు పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos