భారతదేశ చిత్ర పటంలో మన రాజధాని గల్లంతు..

భారతదేశ చిత్ర పటంలో మన రాజధాని గల్లంతు..

కేంద్రం తాజాగా విడుదల చేసిన భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గల్లంతైంది. జమ్మూకశ్మీర్లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత భారత్లో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఏడు నుంచి 9కి పెరిగింది. దీంతో వాటిని చేరుస్తూ కొత్త మ్యాప్ను విడుదల చేసింది.ఆ మ్యాప్లోని అన్ని రాష్ట్రాలు.. వాటి రాజధానులను చూపించిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మాత్రం గుర్తించలేదు. ఏపీ రాజధానిని చూపించే ఎటువంటి సూచికలు ఆ మ్యాప్లో లేకపోవడం వివాదాస్పదమవుతోంది. మ్యాప్లో అసలు అమరావతి పేరే లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించి ఐదేళ్లు దాటినా కేంద్రం దానిని గుర్తించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతాన్ని గుర్తించినప్పటికీ.. సచివాలయాన్ని, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చినప్పటికీ.. కేంద్రం వాటిని గుర్తించలేదు. దీనికి ఉన్న ఏకైక కారణం- ఈ రెండూ తాత్కాలిక కట్టడాలే. వెలగపూడిలో నిర్మించిన సచివాలయం, హైకోర్టు భవనం రెండూ తాత్కాలికమేననే విషయాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా సమాచారం ఇచ్చింది. దీని ఫలితంగా- రాష్ట్ర రాజధాని ఏదనే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టతా లేదు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అమరావతి నిర్మాణంలో ఎలాంటి స్పష్టతా లేదనే విమర్శలు ఉన్నాయి. రాజధానిని అదే ప్రాంతంలో కొనసాగిస్తారా? లేక దొనకొండ లేదా ఇతర ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలిస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. అధికారంలోకి వచ్చిన అయిదు నెలల తరువాత కూడా రాజధాని నిర్మాణంపై వైఎస్ జగన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రెండు దఫాలుగా నిధులను మాత్రం విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు సైతం స్తంభించిపోయాయి. ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos