టిప్పు నిర్మించిన నక్షత్రపు కోట చూశారా?

  • In Tourism
  • September 6, 2019
  • 261 Views
టిప్పు నిర్మించిన నక్షత్రపు కోట చూశారా?

భారతదేశ చరిత్రలో టిప్పు సుల్తాన్కు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.టిప్పుపై వస్తున్న ఆరోపణలు పక్కనపెడితే టిప్పు నిర్మించిన పలు కోటలు,యుద్ధ సమయాల్లో వినియోగించిన ఆయుధాలు ఎప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటాయి.టిప్పు నిర్మించిన కోటల్లో మంజరాబాద్ కోటకు ప్రత్యేక స్థానం దక్కుతుంది.నక్షత్ర ఆకారంలో నిర్మించిన మంజరాబాద్ కోట పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఆశ్చర్యచకితులను చేస్తోంది.కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా సకిలేశ్పురలో సముద్ర మట్టానికి 3,240 అడుగుల ఎత్తులో మంజరాబాద్ కోట నిర్మించారు.సకిలేశ్పుర పట్టణం నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలోని దోణిగల్ అనే గ్రామానికి సమీపంలోని ఓ గుట్ట పై ఈ నక్షత్రాకారపు కోట నిర్మించాడు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట ఉంటుంది. ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించిన ఈ కోట ఎనిమిది కోణాలను కలిగి ఉంటుంది. అత్యంత సురక్షితమైన ఈ కోటను సైనిక కోటగా నిర్మించాడు. ఈ కోటను చేరుకోవాలంటే దాదాపు 250 మెట్లను ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. బెంగళూరు-మంగళూరు రహదారిపై అద్భుతమైన ప్రకృతి పొగమంచు మద్యన ఆకుపచ్చని ఎత్తైన కొండలు, చిక్కటి కాఫీ తోటలతో పరచుకున్న లోయలతో గుభాళిస్తూ పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్ రోడ్ పై మలుపులు తిరిగే ప్రయాణం మరిచిపోలేని మధురానుభూతిని కలిగిస్తుంది. దట్టమైన అడవులు.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా అనిపించే ఎత్తైన వృక్ష సంపద.. జలపాతాల హోరు.. కొండల్ని చీల్చుకుంటూ రైలు పట్టాల ఏర్పాటు కోసం తవ్విన గుహలు.. హోరెత్తుతూ నీటి ప్రవాహాలు.. ఇంతటి ప్రకృతి సౌందర్యంలో మరో అద్భుతమైన కట్టడమైన మంజరాబాద్ కోట కనువిందు చేస్తుంది.వారంతాల్లో ప్రకృతి అందాల మధ్య నిర్మించిన మంజరాబాద్ కోటను చూసి సేద తీరడానికి బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.అందులోనూ ట్రెక్కింగ్ అంటే విపరీతంగా ఇష్టపడే సాహసీకులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంజరాబాద్ కోటను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.గ్రానైట్ రాయితో నిర్మించబడ్డ ఈ కోటలో అనేక గదులు మరియు బావులు ఉన్నాయి. కోట లోపల, వేసవి కాలానికిగాను ప్రత్యేకంగా ఒక గది ఉంది.మంజరాబాద్ కోట నక్షత్రపు ఆకారాన్ని కలిగి ఉండటం వల్ల ఈ కోటకు “స్టార్ ఫోర్ట్ ఆఫ్ ఇండియా” గా పిలుస్తుంటారు..
కోట చరిత్ర..
మంజరాబాద్ కోటను టిప్పు సుల్తాన్ 1785- 1792 మధ్యలో నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో మరాఠాలు మరియు బ్రిటిష్ వారు టిప్పుపై యుద్ధం చేయాలని ప్రణాళిక వేశారు. టిప్పు ఫ్రెంచి వారితో పొత్తు పెట్టుకున్నాడు.ఈ ప్రత్యేకమైన కోటను నిర్మించటానికి ఫ్రెంచ్ సైనిక దళంలో కోట వాస్తుశిల్పి సెబాస్టియన్ లే ప్రెస్ట్రె డి వౌబాన్ను సహాయంతో ఈ కోటను అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఈ కోటను ముఖ్యంగా నాల్గవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో వినియోగించాడు. శ్రీరంగ పట్టణం పతనం తర్వాత బ్రిటీష్ వారు ఈ కోటను తమ స్వాధీనం చేసుకొన్నారు. అటు పై కొన్ని ముఖ్యమైన భాగాలను ధ్వంసం చేశారు.దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కోటలో నీటి నిల్వకు అవసరమైన చిన్న చెరువు ఉంది. యుద్ధ సమయంలో మందుగుండు నిల్వకు అవసరమైన గదులు, వంటగది, స్నానపు గదులు, శౌచాలయాలు ఉన్నాయి. ఈ కోట నుంచి సొరంగం ఉందని చెబుతారు. ఆ సొరంగం ద్వారా వెళితే నేరుగా శ్రీరంగపట్టణానికి చేరుకోవచ్చని చెబుతారు. అయితే ప్రస్తుతం ఈ సొరంగమార్గాన్ని మూసివేశారు.ఈ కోట సమీపంలో ఒక పవిత్రమైన దేవాలయం ఉంది. ఆ ఆలయమే సకలేశ్వర దేవాలయం. ఇది ఒక పురాతనమైన శివాలయం. హోయసల వంశస్తులు హోయ్సళ వాస్తు శైలిలలో నిర్మించినట్లు తెలుస్తోంది..
ఇలా చేరుకోవాలి..
బెంగళూరు నుంచి బస్సు లేదా రైలు మార్గం ద్వారా సకిలేశ్పుర పట్టణానికి చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా మంజరాబాద్ కోటకు చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos