రవి ప్రకాశ్ ఆరోపణల వెనుక అసలు నిజాలు..

పలు కేసులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ చేసిన ఆరోపణలపై టీవీ 9 పాత కొత్త యాజమాన్య సంస్థలు స్పందించాయి.టీవీ9 సంస్థలోకి ఉగ్రవాదులకు నిధులకు సమకూరే రీతిలో నిధులు హవాలా మార్గంలో వచ్చి పడ్డాయంటూ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి.అక్రమాలకు పాల్పడి అడ్డంగా దొరికిపోయి వాటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో రవిప్రకాశ్‌ తమపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ వివరణ ఇచ్చాయి.అందులో భాగంగా  టీవీ9 పాత కొత్త యాజమాన్యాలు కలిసి ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఇందులో.. డీల్ కు సంబంధించిన అన్ని వివరాల్ని వారు వెల్లడించారు.

1)  ‘2018 – ఆగస్టు నాటికి చింతలపాటి హోల్డింగ్స్ – ఐ ల్యాబ్స్ – క్లిపోర్డ్ ఫెరీరా – ఎంవీకేఎన్ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్ లో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24 – 2018న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్ పర్చేజ్ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని – నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది.

2)  రవిప్రకాశ్ ఆరోపిస్తున్నట్లు ఇందులో ఎలాంటి నగదు లావాదేవీ అన్నదే జరగలేదు. ఏబీసీఎల్ కు అప్పటికి ఉన్న బకాయిలను చెల్లించడానికి అలంద మీడియా రూ.150 కోట్లు నేరుగా సంస్థ ఖాతాల్లోకి బదిలీ చేయగా – మిగిలిన రూ.264 కోట్లు పాత ప్రమోటర్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగాయి.

3)  ఈ లావాదేవీలు పాత – కొత్త ప్రమోటర్ల రికార్డుల్లో నమోదయ్యాయి. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మం త్రిత్వ శాఖకు కూడా సమాచారమిచ్చాం. ఈ వ్యవహారమంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప – ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు.

4)  బదిలీ వ్యవహారం ఆగస్టు 2018 లోనే జరిగింది. ఆ సమయంలో టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాశ్ – షేర్ పర్ చేజ్ అగ్రిమెంట్ పై సంతకం కూడా చేశారు. అయినప్పటికీ 9 నెలల తర్వాత – రవిప్రకాశ్ ఈ ఆరోపణలు చేయడం చూస్తుంటే ఫోర్జరీ కేసుల విషయంలో తాను ఎదుర్కొంటున్న క్రిమినల్ విచారణను పక్కదారి పట్టించడానికి – తనను తాను కాపా డుకోవడానికి చేస్తున్న పనే అని అర్థమవుతోంది.

5)   సైఫ్ త్రీ మారిషస్తో కుదిరిన సెటిల్ మెంట్ వ్యవహారం పైనా రవిప్రకాశ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. టీవీ9 విక్రయం జరిగే సమయానికి హైదాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో సైఫ్ త్రీ కంపెనీ వేసిన ఓ కేసు పెండింగ్ లో ఉంది.

6)   ఐ విజన్లో ఉన్న వాటాల విషయంలో సైఫ్ త్రీ ఈ కేసు వేసింది. అయితే.. ఇది సెటిల్ మెంట్ అగ్రిమెంట్ ద్వారా పరిష్కారం అయ్యింది. దీనికి సంబంధించి ఆర్ బీఐ నియమ నిబంధనలకు లోబడి బ్యాంకుల ద్వారానే చెల్లింపు జరిగింది. నిధులను స్వీకరించిన తర్వాత – సైఫ్ త్రీ కేసును ఉపసంహరించుకోవడానికి ఎస్ సీఎల్ టీ అనుమతి కూడా ఇచ్చింది.

7)  రవిప్రకాశ్ చేసిన ఆరోపణల్లో అవాస్తవాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.

బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించే వరకూ రవి ప్రకాశ్ విషయంలో అంతో ఇంతో ఉన్న సానుకూలత మొత్తం.. ఆయన చేసిన తాజా ఆరోపణలతో పూర్తిగా పోయినట్లుగా సమాచారం. కోర్టు ముందు తమను చిత్రీకరించిన తీరుపై కొత్త.. పాత యాజమాన్యాలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. సమాజంలో తమకున్న పేరు ప్రతిష్ఠల్ని దెబ్బ తినేలా ఆరోపణలు చేయటానికి తెగించిన రవి ప్రకాశ్ విషయంలో లెక్కలు తేలాల్సిందేనని.. అతగాడు తమకు చేసిన అన్యాయాలకు సంబంధించిన చిట్టాను తెర మీదకు తేవాలన్న భావనకు వచ్చినట్లుగా సమాచారం. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు వేసే దిశగా ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. వందల కోట్లు పోసి కొనుక్కున్న ఛానల్ ప్రయోజనాలతో పాటు.. తమకున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసే చర్యల్ని ఇక ఉపేక్షించేది లేదన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos