నాతోపాటే అన్నకూడా బీజేపీలోకి..

నాతోపాటే అన్నకూడా బీజేపీలోకి..

 మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనతో పాటు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతారంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి టైటానిక్‌ నావలా తయారైందని ఎంతమంది హీరోలున్నా నావతో పాటు మునిగిపోవడం తథ్యమన్నారు.తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తనతో పాటు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరనున్నారంటూ వ్యాఖ్యానించారు.తాను మాత్రం ఎటువంటి షరతులు లేకుండా బీజేపీలో చేరనున్నామని స్పష్టం చేసిన రాజగోపాల్‌రెడ్డి తాను చేరిన అనంతరం చాలా మంది యువకులు బీజేపీలో చేరుతారంటూ ధీమా వ్యక్తం చేశారు. తన కంటే సీనియర్లు బీజేపీలో చాలా మంది ఉన్నారని ఆయన చెప్పారు. సామాన్య కార్యకర్తగా పార్టీ బలోపేతం కోసం తాను కృషి చేస్తానన్నారు. 20 ఏళ్ల వరకు బీజేపీనే అధికారంలో ఉంటుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల్లో తెలంగాణలో కూడ బీజేపీ అధికారంలోకి వస్తోందన్నారు. పీసీసీ చీఫ్ పదవిని తానే వదులుకొన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పదవికి ప్రస్తుతం రేవంత్ రెడ్డి పేరు విన్పిస్తుందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారంతో టీఆర్ఎస్‌ నేతలకు భయం పట్టుకొన్నట్టుగా ఉందనిపిస్తోందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను ప్రతి నెల చిరుమర్తి లింగయ్యకు రూ. 50వేలు ఇచ్చేవాడినని గుర్తు చేశారు.దేశాభివృద్ధి బీజేపీతో మాత్రమే సాధ్యమని తెలంగాణలో కూడా తెరాసకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని పునరుద్ఘాటించారు.తనపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి,సంక్షేమం తనకు ముఖ్యమని ఇది జరగాలంటే కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు.అందుకే బీజేపీలో చేరనున్నామని స్పష్టం చేశారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos