కొడచాద్రి-ట్రెక్కింగ్ ప్రేమికులకు సరైన విహారం..

  • In Tourism
  • September 18, 2019
  • 272 Views
కొడచాద్రి-ట్రెక్కింగ్ ప్రేమికులకు సరైన విహారం..

కర్ణాటక రాష్ట్రంలో విస్తరించి ఉన్న దట్టమైన పశ్చిమ కనుమలు ప్రకృతి అందాలు,జలపాతాలే కాదు సాహసీకులు ఎంతగానో ఇష్టపడే ట్రెక్కింగ్‌కు కూడా ప్రసిద్ధే.అందులోనూ యువతకు ట్రెక్కింగ్‌ అంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.ప్రకృతి ఒడిలో ఎత్తైన కొండల్లో స్నేహితులతో కలసి ట్రెక్కింగ్‌ చేయడానికి పశ్చిమ కనుమల్లో ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో కోడచాద్రి ఒకటి.కర్ణాటక రాష్ట్రం లోని షిమోగా జిల్లా లో పడమటి కనుమలలో సముద్ర మట్టానికి సుమారు 1343 మీటర్ల ఎత్తులో ఉండే ఒక శిఖరం కోడచాద్రి.కోడచ అంటే కొండలలో పూసే ఒక రకం మల్లె పూవు అని, ఆద్రి అంటే పర్వతం లేదా శిఖరం అని చెపుతారు. ఇక్కడ అధికంగా కనపడే కొండ మల్లెల కారణంగా దీనికి పేరు వచ్చింది.ఏడాదిలో దాదాపు తొమ్మిది నెలలు కొడచాద్రిలో వర్షాలు కురుస్తూనే ఉంటాయి.దీంతో వర్షాకాలంలో చల్లని పరిసరాలూ, మంచు చే కప్పబడిన కొండలూ, పచ్చటి ప్రాంతాలు , స్వచ్చమైన నీటి ప్రవాహాలు, మొదలైన వాటితో కోడచాద్రి ప్రాంతం స్వర్గాన్ని తలపిస్తుంది.

పచ్చటి లోయలు

అడవి మధ్యలో ట్రెక్కింగ్ దారి.

వర్షాకాలంలో కొడచాద్రిలో ట్రెక్కింగ్‌ చేయడం ఉత్సాహంతో కూడుకున్నదే అయినా అంతేస్థాయిలో ప్రమాదం కూడా ఉంటుంది.ఎటు చూసినా తేమతో జారిపోయే నేలలతో ఉండే కొడచాద్రిలో వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేయటం నిజంగా ధైర్య సాహసాలతో కూడిన పర్యటనగా చెప్పవచ్చు.కొంచెం ప్రమాదం ఉన్నా ధైర్యంగా,సమయస్పూర్తతో అడుగులు వేస్తూ ట్రెక్కింగ్‌ చేస్తే కొడచాద్రిలో జీవితకాలం నెమరువేసుకునే విధంగా మధరు అనుభూతులు, జ్ఞాపకాలు మూటగట్టుకోవచ్చు.

కొడచాద్రి శిఖరపు అంచు

కొడచాద్రిలో అందమైన ప్రదేశం

కోడచాద్రి పర్వత ట్రెక్కింగ్ చేయాలంటే ముందుగా నాగోది లేదా నిట్టూరు గ్రామాలకు చేరి అక్కడ నుండి ట్రెక్కింగ్ మొదలుపెట్టవచ్చు.

కొడచాద్రి ట్రెక్కింగ్ ప్రారంభమయ్యే ప్రదేశం

కోడచాద్రి లో కల హిడ్లు మనే జలపాతాలు పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తాయి. కోడచాద్రి కి 5 కి. మీ. దూరంలో కల జలపాతాలను ట్రెక్కింగ్‌ ద్వారా చేరుకోవచ్చు.దట్టమైన అడవుల్లో ఏడు పాయలుగా విడిపోయి కిందకు దూకే హిడ్లుమనే జలపాతం ఆహ్లాదం,తన్మయత్వాన్ని పంచుతుంది. 

హిడ్లుమనె జలపాతం

కోడచాద్రి చుట్టూ అరణ్య ప్రదేశాలు ఈ ప్రదేశాలలో అద్భుత సూర్యోదయ,సూర్యాస్తమయ దృశ్యాలు చూడవచ్చు. అడవిలో మలబార్ లంగూర్స్, కింగ్ కోబ్రాస్, హైనాలు, బైసన్, మరియు కొండచిలువలు వంటివి అనేకం ఉంటాయి.

అందమైన సూర్యోదయం

అద్భుతమైన సూర్యాస్తమయం

అద్వైత సిద్ధాంత కర్త జగద్గురువు శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులవారు తన తపస్సు ఆచరించిన సర్వజ్న లేదా సార్వజన పీఠం దర్శించుకోవచ్చు.

ఆదిశంకరాచారాచార్యులు తపస్సు ఆచరించిన సర్వజ్ఞ మఠం

ఇక్కడి నుంచి సహజంగా ఏర్పడిన గణేశ గుహ అనే స్థలానికి చేరవచ్చు. ఇక్కడ కల మూకాంబిక నేషనల్ పార్క్ లో వివిధ రకాల వృక్ష, జంతు సంపద చూడవచ్చు.

గణేశుడి గుహ

కోడచాద్రి శిఖర ప్రదేశంలో మూకాంబిక దేవి కి సంబంధిన ఒక పురాతన గుడి కూడా చూడవచ్చు. దీనిని దేవి మూకాసురుడనే రాక్షసుడిని వధించిన ప్రదేశంలో నిర్మించారు.అక్టోబర్‌ నుంచి మార్చ్‌ నెల వరకు కొడచాద్రి ట్రెక్కింగ్‌కు,పర్యటనకు అనువైన సమయం.దట్టమైన అడవుల వల్ల కొడచాద్రిలో జలగల సమస్య ఎక్కువగానే ఉంటుంది.

జలగలతో జర హుషార్

కాబట్టి పర్యాటకులు జలగలకు విరుగుడుగా డెటాయిల్‌ లేదా ఉప్పు వెంట తీసుకెళ్లడం ఉత్తమం.కొడచాద్రి అడవుల మధ్యలో అక్కడక్కడా పర్యాటకుల కోసం ప్రైవేటు హోంస్టేలు కూడా అందుబాటులో ఉంటాయి.

కొడచాద్రి అడవుల మధ్య హోంస్టే

ఇలా చేరుకోవాలి..
బస్సు లేదా రైలు మార్గం ద్వారా షిమోగ చేరుకొని అక్కడి నుంచి నాగోడి లేదా కొల్లూరుకు ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి.అక్కడి నుంచి కొడచాద్రి కొండలపైకి ట్రెక్కింగ్‌ మొదలుపెట్టవచ్చు.కొడచాద్రి పర్వతం చేరేందుకు అనేక మార్గాలు కలవు.కానీ ప్రతి మార్గం కూడా చేరేందుకు కష్ట తరంగా నే వుంటుంది.

. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos