కెమ్మనగుండి చూసొద్దాం రండి..

  • In Tourism
  • September 16, 2019
  • 257 Views
కెమ్మనగుండి చూసొద్దాం రండి..

కర్ణాటక రాష్ట్రంలో మలెనాడు జిల్లాల్లో అతిముఖ్యమైనదైన చిక్కమగళూరు జిల్లా పర్యాటక ప్రాంతాలకు ఆలవాలంగా విరాజిల్లుతోంది.ఎత్తైన కొండలు,కాఫీ తోటలు, జలపాతాలు,దట్టమైన పశ్చిమ కనుమలతో అలరారుతోంది.జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తరికెరి తాలూకాలోని కెమ్మనగుండి హిల్స్టేషన్ కూడా ఒకటి.చుట్టూ బాబా బూదాన్ గిరి కొండలు కలవు. ఎత్తైన కొండలు, జలపాత ధారాలు, దట్టమైన అడవులు, పచ్చటి మైదానాలు ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మార్చాయి.కెమ్మనగుండిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం జీ పాయింట్.ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలోని సహజ ప్రకృతి దృశ్యాలను, అందమైన శాంతి జలపాతాలను చూసి ఆనందించవచ్చు.అదే విధంగా రెండు దశలలో ప్రవహించే హెబ్బే జలపాతం ఎంతో ప్రత్యేకమైనది.సుమారు 168 మీటర్ల ఎత్తు నుంచి దూకే కాఫీ తోటల్లో ఉన్న ప్రదేశాన్ని చేరాలంటే, కాలినడకన లేదా నాలుగు చక్రాల వాహనాలపైన కూడా చేరవచ్చు. జలపాతం ప్రవాహం మద్యలో రెండుగా చీలి పెద్ద చీలిక ‘దొడ్డ హెబ్బె’ గాను చిన్న చీలిక ‘చిక్క హెబ్బే’ గాను ప్రవహిస్తుంది. ప్రశాంత వాతావరణం ఆనందించాలనుకునేవారికి హెబ్బే జలపాతాలు, చుట్టుపట్ల ప్రదేశాలు అనువుగా ఉంటాయి. పర్యాటకులు ఇక్కడ స్నానాలను కూడా చేయవచ్చు. ఈ జలపాత నీటిలో ఔషధ గుణాలున్నాయని, అవి చర్మ సంబంధిత వ్యాధులను, సాధారణ దగ్గు జలుబులను నివారిస్తాయని ప్రసిద్ధి.శాంతి జలపాతాలతో పాటు 120 మీటర్ల ఎత్తు నుంచి వయ్యారంగా జాలువారే కలాట్టి జలపాతాలు కూడా ఇక్కడే ఉన్నాయి.వీటిని కాళహస్తి జలపాతాలు లేదా కాళతగిరి జలపాతాలు అంటారు. ఇవి 120 మీటర్ల ఎత్తునుండి కింద పడతాయి.ఈ ప్రాంతంలోని విజయనగర కాలంనాటి దేవాలయం ఒకటి కలదు. ముళ్ళయనగిరి ,భద్ర టైగర్ రిజర్వ్ లు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. కెమ్మనగుండి పర్యటించే యాత్రికులు ప్రధాన ఆకర్షణ అయిన ‘రాక్ గార్డెన్’ తప్పక చూడాలి. ఇది రాళ్ళతో మలచబడింది. వివిధ రకాల పూవులు చూడవచ్చు. అందమైన సూర్యాస్తమయం కొండలలోకి జారిపోవటాన్ని గమనిస్తారు. రాక్ గార్డెన్ చివరినుండి భద్ర రిజర్వాయర్ కూడా దర్శించవచ్చు. ఈ గార్డెన్లో సూర్యాస్తమయ అద్భుతంగా ఉంటుంది.సాహస క్రీడలు ఇష్టపడే వారికి వారాంతంలో రెండు రోజులు కుటుంబంతో స్నేహితులతో పర్యటించడానికి కెమ్మనగుండి అనువైన ప్రదేశం.రాత్రి వేళల్లో బస చేయడానికి రెసార్టులు,హోంస్టేలు కూడా ఉన్నాయి..
ఎల్లప్పుడూ మేఘావృతమై చల్లటి వాతావరణంతో ఆహ్లాదాన్ని పంచే ఈ ప్రాంతాన్ని నాల్గవ క్రిష్ణరాజ ఒడయార్ బాగా ఇష్టపడేవాడని దీంతో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృధ్ధి చేశాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. క్రిష్ణరాజ ఒడయార్ పేరుతో కెమ్మనగుండిని కె.ఆర్. హిల్స్ అని కూడా అంటారు.ఈ ప్రాంతాన్ని వినోదం,విహార స్థలంగా మార్చుకోవడానికి ఈ ప్రాంతంలో రోడ్లు, అందమైన తోటలు నిర్మించారు.తర్వాతి కాలంలో ఆయన ఈ ప్రాంతాన్ని కర్నాటక ప్రభుత్వానికి అప్పగించాడు. అప్పటి నుండి ఈ రిసార్టును కర్ణాటక ప్రభుత్వ హార్టికల్చరల్ డిపార్ట్ మెంట్ నిర్వహిస్తోంది.
ఇలా చేరుకోవాలి..
బెంగళూరు నుంచి 243 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కమగళూరు జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.లేదా రైలు మార్గం ద్వారా బీరూర్,కడూర్ స్టేషన్లకు చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా కెమ్మనగుండికి చేరుకోవచ్చు..

దట్టమైన అడవులతో లోయలు..


జీ పాయింట్‌..


రాక్‌ గార్డెన్‌..


కాళహట్టి జలపాతం..


శాంతి జలపాతం..


హెబ్బె జలపాతం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos