ఐసీసీ టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా విరాట్‌

ఐసీసీ టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా విరాట్‌

దుబాయ్‌: టీమిండియా పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. 2018 ఏడాదికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన పురుషుల‌ టెస్టు, వన్డే జట్లను ప్రకటించింది. గతేడాది అటు బ్యాట్స్‌మన్‌గా.. ఇటు సారథిగా అద్భుత ప్రదర్శన కనబరిచిన విరాట్.. ఈ రెండు జట్లకు సారధ్య బాధ్యతలు సంపాదించుకోవడం విశేషం. ‘2018లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ చూపిన అద్భుత ప్రదర్శనకు గాను ఐసీసీ టెస్టు, వన్డే జట్టులకు కెప్టెన్‌గా అతని పేరును ప్రకటించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో భారత్‌, న్యూజిలాండ్‌ నుంచి ముగ్గురేసి ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు. వన్డే జట్టులో భారత్‌ నుంచి నలుగురు, ఇంగ్లాండ్‌ నుంచి నలుగురు చోటు దక్కించుకున్నారు. కోహ్లీ తర్వాత రెండు జట్లలో చోటు సంపాదించుకున్న భారత ఆటగాడు ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రానే. ఐసీసీ ఓటింగ్‌ అకాడమీ ద్వారా ఈ జట్లను ప్రకటించారు. ఈ అకాడమీలో మాజీ ఆటగాళ్లు, మీడియా, బ్రాడ్‌కాస్టింగ్‌ సభ్యులు ఉంటారు. కోహ్లీ గతేడాది 13 టెస్టుల్లో ఐదు శతకాలు నమోదు చేసి 55.08 సగటుతో మొత్తం 1,322 పరుగులు చేయగా.. 14 వన్డేల్లో ఆరు శతకాలతో మొత్తం 1,202 పరుగులు నమోదు చేశాడు. దీంతో మెజారిటీ ఓటర్లు రెండు జట్లకు కెప్టెన్‌గా కోహ్లీని ప్రతిపాదించారు. అలాగే కోహ్లీ 2018 సంవత్సరాన్ని టెస్టు, వన్డేల్లో టాప్‌ ర్యాంకింగ్‌ బ్యాట్స్‌మన్‌గా ముగించాడు. గతేడాది కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆరు టెస్టుల్లో విజయం సాధించగా.. ఏడింట్లో ఓటమిపాలైంది. ఇక వన్డేల్లో భారత్‌ ఖాతాలో 9 విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు కాగా..  ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos