టాటా కంపెనీలో స్థానికులకు ఉద్యోగాల మాటేమిటి..?

టాటా కంపెనీలో స్థానికులకు ఉద్యోగాల మాటేమిటి..?

హోసూరు : ఇక్కడికి సమీపంలో ని ఉద్ధనపల్లి వద్ద టాటా కంపెనీని ప్రారంభించినంత మాత్రాన స్థానికులకు ఒరిగేదేమీ లేదని హోసూరు మాజీ ఎమ్మెల్యే కె.ఎ. మనోహర న్ అన్నారు. ఉద్ధనపల్లి సమీపంలోని తిమిజే పల్లి వద్ద టాటా సంస్థ అయిదు వందల ఎకరాలలో ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీ కంపెనీ ప్రారంభించనుంది. అందులో భాగంగా 26వ తేదీ తిమిజీపల్లి వద్ద  జిల్లా కలెక్టర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. టాటా సంస్థ కొత్తగా ప్రారంభించే కంపెనీద్వారా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 15 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలయ్యింది. టాటా సంస్థ ప్రారంభించే కొత్త కంపెనీ ద్వారా ఉద్ధనపల్లి ప్రాంతం అభివృద్ధి మాట పక్కన పెడితే స్థానికులకు ఉద్యోగాలు కలేనని మాజీ ఎమ్మెల్యే కె.ఎ. మనోహర న్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు హోసూరు దర్గా వద్ద ప్రారంభమైన టైటాన్ కంపెనీలో పనిచేసేందుకు స్థానిక కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠశాలల్లోనే ఇంటర్యూ లు నిర్వహించి, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం టాటా సంస్థ కొత్తగా ప్రారంభించే కంపెనీకి ఐఐటీలో చదువుతున్న వారిని ఎంపిక చేయనున్నారని మనోహరన్ తెలిపారు. టాటా సంస్థ నిర్వాకం వల్ల స్థానికులకు ఉద్యోగాలు దొరికే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తతంగం జరుగుతున్నా నోరు మెదపకుండా మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటని స్థానిక నేతలకు పరోక్షంగా చురకలంటించారు. హోసూరు ప్రాంతంలో పట్టభద్రులకు సరైన ఉద్యోగాలు దొరకక ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలిసినా, టాటా సంస్థ యాజమాన్యం వద్ద ప్రస్తావన ఇంతవరకు తేలేదని మనోహరన్ అన్నారు. స్థానిక నేతలు ఇప్పటికైనా స్పందించి టాటా సంస్థలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని మనోహరన్ డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos