అప్పనంగా వచ్చిన సొమ్ముతో కుప్పి గంతులు

అప్పనంగా వచ్చిన సొమ్ముతో కుప్పి గంతులు

హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికా రాణి అవినీతి బాగోతంలో రోజుకో కొత్త కోణం ఆవిష్కృతమవుతోంది. అక్రమంగా దోచుకున్న డబ్బుతో ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గుర్తించారు. ఆమె అక్రమాస్తులు, విలాసాలు, వాటికి వెదజల్లిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాలపై ఏసీబీ ఇప్పటికే కూపీ లాగడం ప్రారంభించింది. ఇటీవల ఈ కేసులో తేజా ఫార్మా ఎండీ సోదరుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో దాడులు చేసిన ఏసీబీ శుక్రవారం అతన్ని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తన వద్ద పని చేసే కొడాలి నాగలక్ష్మి సాధారణ ఫార్మాసిస్ట్ అయినప్పటికీ ఆమె కూడా కోట్ల రూపాయల అక్రమార్జన గడించడం విశేషం. డైరెక్టర్‌గా ఉన్న కాలంలో దేవికారాణి అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆమెకు, నాన్ రేటెడ్ కంపెనీ (ఎన్ఆర్సీ)ల నుంచి వచ్చే కమీషన్లు సరిపోలేదు. అందుకే తన అనుచరురాలు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మితో కలసి రెండు డొల్ల కంపెనీలు సృష్టించారు. ఇందులో మహీధర మెడికల్ అండ్ సర్జికల్స్‌ను నాగలక్ష్మి బంధువైన ఎం. మురళీకృష్ణ పేరుపై ఉంచగా, మురళీకృష్ణ భార్య ఎం.విజయలక్ష్మీ పేరిట జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్‌ను స్థాపించారు. వీటిని తేజా ఫార్మాస్యూటికల్స్ ఎండీ రాజేశ్వర్‌ రెడ్డి 2016లో రిజిస్టర్ చేయించారు. ఈ వ్యవహారంలో కింది స్థాయి సిబ్బంది ఆమెకు సహకరించినట్లుగా ఏసీబీ గుర్తించింది. అక్రమమార్గంలో కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బును దేవికారాణి, నాగలక్ష్మి, రాజేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఖరీదైన హోటళ్లలో బర్త్డే పార్టీలు, విందులు, వినోదాలు, పబ్‌లు అంటూ అందుబాటులో ఉన్న ప్రతీ విలాసాన్నీ అనుభవించారు. తేలిగ్గా వస్తున్న డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియక వీరు చాలా కొత్త పనులు ముందేసుకునేవారు. ఆఫీసులో సందర్భాలను సృష్టించుకుని అందులో డ్యాన్సులు చేయడానికే పార్టీలు జరుపుకునేవారు. ఆ పార్టీల్లో దేవికా రాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు తహతహలాడేవారు. ప్రత్యేకంగా బ్యూటీషియన్లు, డ్యాన్స్ మాస్టర్లను పెట్టుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారు. స్వయంగా అన్ని వేడుకల్లో ఆమే నృత్యం చేసేవారు. ఆత్మక్షణ కోసం నాన్‌ చాక్‌ తిప్పడం కూడా నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దేవికా రాణి అవకతవకల చిట్టా…
2016–18లో మహీధర మెడికల్ అండ్ సర్జికల్స్ కంపెనీకి రూ.3 కోట్లా 69 లక్షలా 58 వేలా 500 విలువైన కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు. ఈ మందులు రేట్ కాంట్రాక్ట్ కంపెనీ (ఆర్సీ)ల ద్వారా కొనుగోలు చేస్తే వాస్తవానికి కేవలం రూ.61 లక్షలా 99 వేలా 972 మాత్రమే ఖర్చయ్యేది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.3 కోట్లా 7 లక్షలా 58 వేలా 528 నష్టం వాటిల్లింది. రాజేశ్వర్ రెడ్డి తమ్ముడు శ్రీనివాస రెడ్డికి సంబంధించిన వైష్ణవి ఎంటర్ప్రైజెస్‌కు రూ.5.50 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. ఇవి రేట్ కాంట్రాక్ట్ ప్రకారం రూ.1.41 కోట్లు మాత్రమే. ఫలితంగా ప్రభుత్వానికి రూ.4.09 కోట్లు నష్టం వాటిల్లింది. తేజా ఫార్మా ఎండీ రాజేశ్వర్రెడ్డి, అతడి సోదరుడు శ్రీనివాసరెడ్డిలకు మొత్తం ఎనిమిది డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు వచ్చిన కాంట్రాక్టులన్నీ నిబంధనలకు విరుద్ధంగా దేవికారాణి కట్టబెట్టినవే కావడం గమనార్హం. ఇలా వచ్చిన ఆదాయాన్ని పీఎంజే జ్యువెలరీస్‌కు మళ్లించారు. అయితే అక్కడ కేవలం నగల కొనుగోలుకే పరిమితమయ్యారా? ఇంకేదైనా లావాదేవీలు జరిపారా? అన్న విషయంలో ఏసీబీ లెక్కలు తవ్వుతోంది. మహీధర మెడికల్ అండ్ సర్జికల్, జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్, ఎస్ఎస్ అసోసియేట్స్, సాయి శ్రీనివాస తదితర కంపెనీలకు ప్రాసెసింగ్, ఇన్వాయిస్, కొటేషన్స్ చేసి దాని ద్వారా వచ్చిన సొమ్మును నేరుగా అప్పటి డైరెక్టర్ దేవికారాణికి లేదా ఆమె సూచించిన వ్యక్తులకు అందజేసేవారు. మొత్తంగా ఇలా అక్రమ మార్గాల్లో దాదాపు రూ.10.85 కోట్ల మేరకు దేవికారాణి ముఠా కాజేసినట్లు ఏసీబీ పరిశీలనలో వెల్లడైంది. ప్రభుత్వ జీవో నం.51 ప్రకారం రేటెడ్ కంపెనీల ద్వారా మందులు కొనాలి. కానీ, నిబంధనలను తుంగలో తొక్కిన దేవికారాణి, రేటెడ్ కంపెనీలను పక్కనబెట్టి, తన బినామీలు సమర్పించిన నాన్‌ రేటెడ్ కంపెనీలకు ముందుగా బిల్లులు చెల్లించేది. అందుకు రేటెడ్ కంపెనీల పనితీరు బాగా లేదని నిందలు వేసి నాన్‌ రేటెడ్‌ కంపెనీలకు వాస్తవ ధర కంటే 10 రెట్లు అధికంగా కట్టబెట్టేది. ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగించేందుకు అంతకుముందున్న నిబంధనలకు తిలోదకాలిచ్చి ఎస్డీడీయూ (స్పెషల్ డ్రగ్ డిస్పెన్సరీ యూనిట్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి సనత్ నగర్‌లో ఓ గోదాము ఏర్పాటు చేసింది. ఇక్కడ మందులు వచ్చినట్లు బిల్లులు సృష్టించి వాటిని తన అనుచరులతో డ్రా చేసుకునేది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos