ఏనుగులున్నాయోచ్…అధికారుల హెచ్చరిక

ఏనుగులున్నాయోచ్…అధికారుల హెచ్చరిక

హోసూరు : ఇక్కడికి సమీపంలోని శ్యా నమావు అటవీ ప్రాంతానికి 35 ఏనుగుల మంద రావడంతో చుట్టుపక్కల గ్రామస్థులు అటవీ ప్రాంతంలో సంచరించరాదని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఏటా బెంగళూరు శివారులోని బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి జవుల గిరి అటవీప్రాంతంలోకి 150 ఏనుగుల మంద రావడం, నెలరోజుల తరువాత తిరిగి వెళ్లడం అందరికి తెలిసిందే. ప్రతి ఏటా అక్టోబరు నెలలో హోసూరు అటవీ ప్రాంతానికి రావలసిన ఏనుగులు ఈసారి నెల ఆలస్యంగా చేరుకొన్నాయనే చెప్పాలి. అటవీ శాఖ అధికారులు జవులగిరి, డెంకనికోట హోసూరు అటవీ ప్రాంతంలో సౌర కంచె, అత్యధిక శక్తివంతమైన తాడు కంచె ఏర్పాటు చేయడంతో బన్నేరుగట్ట ఆటవీ ప్రాంతం నుండి జవులగిరికి చేరుకున్నా, అటవీ శాఖ ఏర్పాటు చేసిన కంచెను దాటి హోసూరు ఆటవీ ప్రాంతానికి రాలేకపోయాయి. హోసూరు అటవీ ప్రాంతంలోకి అడ్డ దారిలో నెల రోజుల తరువాత చేరుకున్నాయి. 150 ఏనుగుల మంద నుంచి 35 ఏనుగులు వేరుపడి, ఈ వేకువ జామున హోసూరు సమీపంలోని శ్యానమావు అటవీప్రాంతంలోకి చొరబడడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. కెలవరపల్లి డ్యాం ఆయకట్టు ప్రాంతమైన పాతకోట, రామాపురం, పోడూరు తదితర ప్రాంతాలలో వరి పంట కోత దశకు చేరుకున్న తరుణంలో 35 ఏనుగులు శ్యానమావు ఆటవీ ప్రాంతానికి చేరుకోవడంతో రైతులు కలవరం చెందుతున్నారు. చేతికొచ్చిన వరి, రాగి పంటలను ఎక్కడ ధ్వసం చేస్తాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్యానమావు అటవీ ప్రాంతంలోకి చేరిన ఏనుగుల మందను వెంటనే తరిమి వేయడం ద్వారా పంటలను కాపాడాలని హోసూరు అటవీ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos