వివాహాల పేరిట వంచన

  • In Crime
  • June 13, 2019
  • 147 Views
వివాహాల పేరిట వంచన

హైదరాబాద్‌ : వివాహాల పేరిట వంచనకు పాల్పడుతున్న కోరం అర్చన (30) అనే మహిళను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ శ్రీనివాస్‌ కథనం మేరకు నెల్లూరు జిల్లా ఇనమడుగుకు చెందిన అర్చన నగరంలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. పెళ్లి పేరుతో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడేది. గూగుల్‌ నుంచి ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకుని విదేశాల్లో ఉన్నతోద్యోగం చేస్తున్న వరుడు కావాలంటూ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇచ్చేది. వీటిపై స్పందించే వరులు, వారి తల్లిదండ్రులను మోసం చేసేది. ఫోన్‌లో సంప్రదించే వరులు, తల్లిదండ్రుల నుంచి నిశ్చితార్థం కోసం ఉంగరాలు, ఆభరణాలు కావాలంటూ డబ్బులు లాగేది. ఆ మొత్తాలను తన ఖాతాలోకి వేయించుకుని పత్తా లేకుండా పోయేది. ఎవరితోనూ నేరుగా కలవకుండా వ్యవహారమంతా ఫోనులోనే సాగించేది. విదేశ నంబరు ఉన్న ఫోనును ఉపయోగించేది. తల్లి, తండ్రి, కుటుంబ సభ్యుల మాదిరిగా గొంతులు మార్చి అంతా తానై మాట్లాడేది. దీని కోసం ప్రత్యేక యాప్‌లను ఉపయోగించుకుంటోంది. పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడుతుండగా గతంలో సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. 2018లో అయిదు నెలల పాటు జైలు శిక్ష అనుభవించింది. డిసెంబరులో విడుదలై మళ్లీ అదే పని మొదలుపెట్టి పోలీసులకు దొరికిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos