మమత ధర్నాలో సీపీనా? : బీజేపీ

మమత ధర్నాలో సీపీనా? : బీజేపీ

న్యూఢిల్లీ: కోల్‌కతా సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతోంది. సీబీఐకి, రాష్ట్ర పోలీసులకు మధ్య తలెత్తిన వివాదంపై మమతాబెనర్జీ ధర్నాకు దిగడం, రాజకీయ కక్ష సాధింపు కోసమే కేంద్రం సీబీఐని ఉసిగొల్పుతోందని కేంద్ర ప్రభుత్వంపై సమరానికి సై అనడంతో బీజేపీ ఘాటుగా స్పందించింది. ధర్నాకి కూర్చోవడం ద్వారా కేజ్రీవాల్ బాటనే మమతా బెనర్జీ ఎంచుకున్నారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న చిట్‌ఫండ్ స్కామ్‌లో 20 లక్షల మంది ప్రజలు డబ్బులు పోగొట్టుకున్నారని 2014లో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కాంగ్రెస్ ట్వీట్ చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తాము అదే ఏడాది మే 26న ప్రమాణస్వీకారానంతరం నారద, శారదా కుంభకోణాలపై దర్యాప్తులు జరిపించామన్నారు. కుంభకోణాలపై దర్యాప్తు జరపడం నేరమా? అని రవిశంర్ ప్రసాద్ ప్రశ్నించారు. ‘ఒక పోలీస్ కమిషనర్ రాజకీయనాయకులతో కలిసి ధర్నాలో కూర్చుకున్నారు. దీని అర్ధం ఏమిటి? కమిషనర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి ధర్నాలో కూర్చోవడం అసాధారణ పరిణామం. దేశంలో అసలు ఏం జరుగుతోంది?’ అని రాష్ట్ర సర్కార్‌ను ఆయన నిలదీశారు. మమత సారథ్యంలో మహాకూటమి ఏర్పాటు ప్రయత్నాలపైనా రవిశంకర్ ప్రసాద్ విమర్శలు గుప్పించారు. అదొక అవకాశవాదుల కూటమి అని అభివర్ణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos