మన మధ్య యుద్ధం ఆత్మహత్యతో సమానం

ఇస్లామాబాద్: ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం కోసం పాకిస్థాన్‌ చేసే ప్రయత్నాలకు భారత్ సహకరించడం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. అణ్వస్త్ర ఆయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధమనేది ఆత్మహత్యతో సమానమని హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
‘అణ్వస్త్ర ఆయుధ సంపత్తి కలిగిన రెండు దేశాలకు యుద్ధం గురించి ఆలోచనే రాకూడదు. ప్రచ్ఛన్న యుద్ధం(కోల్డ్ వార్) గురించి కూడా ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఆ పరిస్థితులు కూడా చివరికి చేయిదాటి యుద్ధానికి దారి తీయొచ్చు. ద్వైపాక్షిక చర్చలే పరిష్కార మార్గం. అణు ఆయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం ఆత్మహత్యతో సమానం. శాంతి నెలకొల్పడానికి తాము చేసే ప్రయత్నాలకు భారత్ స్పందించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. పాక్‌ ఉగ్రవాద కార్యకలాపాల మీద ఉక్కుపాదం మోపితేనే ఆ దేశంతో చర్చలు సాధ్యమని భారత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘భారత్ ఒకడుగు ముందుకేస్తే, పాక్‌ రెండడుగులు ముందుకొస్తుంది. ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి అనేక మార్లు పాక్‌ చేస్తోన్న ప్రతిపాదనలను భారత్ తిరస్కరిస్తుంది’ అని ఇమ్రాన్‌ ఆరోపించారు. భారత్ కశ్మీరీల హక్కులను అణచివేయలేదని విమర్శించారు.

2016లో పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు భారత్‌ మీద దాడికి పాల్పడటం, దానికి ప్రతీకారంగా పీఓకేలో భారత్ మెరుపు దాడులు నిర్వహించడం ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos