నిర్లక్ష్యం ఖరీదు ఐదు ప్రాణాలు…

  • In Crime
  • February 1, 2019
  • 144 Views
నిర్లక్ష్యం ఖరీదు ఐదు ప్రాణాలు…

పేదరికంలో మగ్గుతున్న
తమ కుటుంబాలకు ఆసరాగా నిలవడానికి జీవనోపాధి వెతుక్కుంటూ రాష్ట్రం కాని రాష్ట్రానికి
వచ్చిన ఐదు మంది కూలికార్మికులను బలి తీసుకొని విధి ఐదు మంది కూలి కార్మికుల ఇళ్లల్లో
శాశ్వత చీకట్లు నింపింది.ఈ విషాదకర ఘటన మేడ్చల్‌ జిల్లా కీసర మండలం రాంపల్లిలో గురువారం చోటుచేసుకుంది. నగర శివారులోని రాంపల్లిలో పేదల కోసం ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 52 బ్లాకుల్లో 6,240 ఇళ్లను దాస్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే ప్రయివేటు నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.రాష్ట్రంతో పాటు బిహార్‌,పశ్చిమబెంగాల్‌,జార్ఖండ్‌,ఒడిశా
రాష్ట్రాలకు చెందిన రెండు వేల మంది కార్మికులు కూడా పని చేస్తున్నారు.ఈ క్రమంలో గురువారం
12వ బ్లాక్‌లో పదో అంతస్తులో ప్లాట్‌ఫాంపై నిలబడి పనులు చేస్తుండగా
టైరాడ్‌ సరిగా బిగించకపోవడంతో ప్లాట్‌ఫామ్‌ హఠాత్తుగా కూలిపోయింది.దీంతో పదవ అంతస్తులో
పని చేస్తున్న బిహార్‌కు చెందిన యాష్‌కుమార్‌ చౌదరి(20), పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుబల్‌రాయ్‌(32), సైపుల్‌హక్‌(26), అబిజిత్‌రాయ్‌(18) ,మిలాన్‌షేక్‌(20) ,విబ్లవ్‌రాయ్‌(18) అంత పైనుంచి పడిపోయారు.ఘటనలో
యాష్‌కుమార్‌,సుబల్‌రాయ్‌,సైపుల్‌హక్‌,అభిజిత్‌రాయ్‌లు అక్కడిక్కడే మృతి చెందగా మిలాన్‌షేక్‌
ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమమధ్యలో మృతి చెందారు.ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విబ్లవ్‌రాయ్‌
పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ
యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కుషాయిగూడ   ఏసీపీ శివకుమార్‌ నేతృత్వంలో కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
కూలీలు మరణించడంతో కోపోద్రిక్తులైన సహచరులు ఆగ్రహంతో సముదాయంలోని సంస్థ కార్యాలయం, అక్కడున్న సిబ్బందిపై దాడి చేయడంతో వారు తప్పించుకుని పారిపోయారు. కీసర సీఐ ప్రకాశ్‌ యాదవ్‌ సిబ్బందితో వెళ్లి కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కూలీలను అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్లనే కూలీల ప్రాణాలు పోయాయని ఈ సందర్భంగా ఇతర కూలీలు ఆరోపించారు. పనిచేసే ప్రాంతంలో తమకు ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో ఇటీవల ఓ కూలీ బహిర్భూమికి వెళ్లేందుకు రాత్రి వేళ ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొని మరణించినట్లు పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ డా.ఎం.వి.రెడ్డి, రాచకొండ కమిషనరేట్‌ జాయింట్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ శివకుమార్‌లు పరిశీలించారు. వేలాది మంది కూలీలు పని చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై కంపెనీ సూపర్‌వైజర్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సహాయ ఇంజినీరు(ఏఈ) ఎస్‌.నర్సరాజును సస్పెండ్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున పరిహారాన్ని అందించనున్నట్లు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మేయర్‌ నిధుల నుంచి రూ.2 లక్షలు, కాంట్రాక్టర్‌ ద్వారా రూ.5లక్షలు, కార్మిక బీమా నుంచి రూ.8 లక్షలు మొత్తం రూ.15 లక్షలు బాధిత కుటుంబాలకు అందించనున్నట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ మరో కార్మికుడికి సూపర్‌ స్పెషాలిటీ అసుపత్రిలో వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. మృతదేహాలను స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos