తేలని సీబీఐ చీఫ్‌ నియామకం

తేలని సీబీఐ చీఫ్‌ నియామకం

 కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చీఫ్‌ నియామకం ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని నివాసంలో మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి కమిటీ దాదాపు గంటకుపైగా చర్చించినా పేరు ఖరారు కాలేదు. కమిటీలో ప్రధానితోపాటు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే సభ్యులుగా ఉన్నారు. కొత్త బాస్‌ కోసం ప్రభుత్వం కొందరి పేర్లను సూచించగా ఖర్గే అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు జావెద్‌ అహ్మద్‌, రజనీకాంత్‌ మిశ్రా, ఎస్‌.ఎస్‌.దేశ్వాల్‌, శివానంద ఝా పేర్లు ప్రధానంగా పరిశీనలో ఉన్నట్లు సమాచారం. వీరిపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీబీఐకి వెంటనే కొత్త డైరెక్టర్‌ను నియమించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు ఆ పని జరగలేదు.  ఇందుకోసం జనవరి 24న సమావేశమైన అత్యున్నత స్థాయి కమిటీ ఏ నిర్ణయం తీసుకోలేదు. నేడు జరిగిన సమావేశంలోనూ నిర్ణయం వెలువడలేదు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా ముందుకు అడుగు వేస్తుందో చూడాలి. ప్రభుత్వం సూచించిన పేర్లతో ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ మద్దతు తెలిపితే పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఏ నిర్ణయం రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos