తెలంగాణ గవర్నర్‌గా యడియూరప్ప…?

న్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్‌గా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌. యడియూరప్పను నియమించనున్నట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సందర్భంగా తాను కర్ణాటకను విడిచి ఎక్కడికీ వెళ్లేది లేదని, ఇక్కడే ఉంటానని యడియూరప్ప కరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే సుదూర రాష్ట్రానికి కాకుండా, కర్ణాటక పక్కనే ఉన్న తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తామని, అందుకు సమ్మతించాలని బీజేపీ అధిష్టానం యడియూరప్పను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. యడ్యూరప్ప ప్రస్తుతం కుటుంబ సమేతంగా మారిషస్‌ విహార యాత్రలో ఉన్నారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల పర్యటన సందర్భంగా ఆమె తనను పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పూర్తి స్థాయిలో నియమించాలని, తెలంగాణ గవర్నర్‌ బాధ్యతల నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. ఆమె విన్నపాన్ని ఆమోదించినట్లయితే ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెల మొదట్లో కానీ ఆమెను పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమిస్తారని సమాచారం. కర్ణాటకను విడిచి వెళ్లడానికి యడియూరప్ప సుముఖంగా లేకున్నా, ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పూర్తి స్వేచ్ఛతో పని చేయడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో యడియూరప్పకు కోపం రాకుండా, మెల్లగా ఒప్పించి తెలంగాణకు పంపాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి యడియూరప్ప సమ్మతిస్తారా, లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos