బీజేపీలోకి తోటవాణి!

బీజేపీలోకి తోటవాణి!

 వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్న అధిష్టానం వ్యూహాల అమలులో వేగం పెంచింది.అందులో భాగంగా కాంగ్రెస్‌,తెదేపాతో పాటు అధికార వైసీపీ పార్టీల నేతలను కూడా బీజేపీలో చేర్చుకోవడానికి బేరసారలకు తెర తీసింది.ఇప్పటికే నలుగురు తెదేపా రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి చేర్చుకున్న బీజేపీ మరింత మంది తెదేపా నేతలను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.పైకి తెదేపాను బలహీన పరచి ప్రధాన పార్టీగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతూనే లోలోపల అధికార వైసీపీని కూడా దెబ్బ తీయాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు చూస్తుంటే స్పష్టమవుతోంది.తెలంగాణలో అనుసరిస్తున్న వ్యూహాన్నే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో మాజీ ఎంపీ, వైసీపీ నేత తోట నరసింహం భార్య తోట వాణితో బీజేపీ అధిష్టానం ఇప్పటికే సంప్రదింపులు జరిపిందని తోట వాణి కూడా కషాయం కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.2019 ఎన్నికల ముందు వరకు తెలుగుదేశంలో ఉన్న తోట నరసింహం అనారోగ్య కారణాలతో పోటీగా దూరంగా ఉంటానని.. తనకు బదులు తన భార్య తోట వాణికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు.అయితే దీనికి చంద్రబాబు ససేమిరా అనడంతో నరసింహం, ఆయన భార్యతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వెంటనే వైసీపీ చీఫ్ తోట వాణికి పెద్దాపురం టికెట్ కేటాయించారు.అయితే ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్ధి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొద్దిరోజుల క్రితం చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ జిల్లా ఎస్పీతో పాటు కోర్టును సైతం ఆశ్రయించారు వాణి.కానీ ఏం జరిగిందో తెలియదు కానీ.. ఉన్నట్లుండి బీజేపీలో చేరాలని తోటవాణి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ద్వారా బీజేపీకి చెందిన జాతీయ నాయకులతో తోట నరసింహం, వాణి దంపతులు మంతనాలు జరిపినట్లుగా సమాచారం.ఒకవేళ వీరి ప్రయత్నాలు ఫలించి వాణి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఏపీలోని బలమైన కాపు సామాజిక వర్గం అటు దిశగా వెళ్లే అవకాశాలు లేకపోలేదంటున్నారు నేతలు. కాగా.. వాణి బీజేపీలో చేరుతారన్న వార్తల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ వెంట‌నే అక్క‌డ కార్యాచరణ ప్రారంభించారు.జిల్లాకు చెందిన మంత్రి బోస్‌తోనూ..అదే విధంగా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆళ్ల‌నానితోనూ చ‌ర్చించారు. ఇక వాణి పార్టీ మార‌కుండా వారించాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌తిపక్షంలో ఉన్న స‌మ యంలోనే పార్టీ మారేవారి విష‌యంలో ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేద‌ని..ఇప్పుడు అస‌లు అవ‌సరం లేద‌నే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో..తోట వాణి స్థానంలో పెద్దాపురం లో పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌గా కొత్త వారికి బాధ్య త‌లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగా ..పెద్దాపురం వైసీపీ ఇంచార్జ్‌గా దవులూరి దొరబాబుకు బాధ్యతలు అప్పగించారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు వైసీపీలో క‌ల‌క‌లం రేపుతోంది.అయితే ఈ వార్తలపై తోటవాణి స్పందించారు.సోషల్మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదని హితవు పలికారు

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos