మొదలైన పదవుల వేట..

మొదలైన పదవుల వేట..

కర్ణాటక రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి,బీజేపీ మధ్య జరిగిన ఎత్తుకు పై ఎత్తుల రాజకీయాలు, రెసార్టుల పర్వాలు,సుదీర్ఘ బలపరీక్షల అనంతరం చివరకు బీజేపీ అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.దీంతో బీజేపీ అధికార పక్షం,కాంగ్రెస్‌-జేడీఎస్‌లు ప్రతిపక్ష హోదాలో కొనసాగడానికి సిద్ధమవుతున్నాయి.అయితే ఇక్కడే కాంగ్రెస్‌-బీజేపీ పార్టీలకు అసలు చిక్కు వచ్చి పడింది.అధికార బీజేపీలో ముఖ్యమంత్రి మినహా మిగిలిన అన్ని పదవులకు పోటీ భారీస్థాయిలో నెలకొంది.బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్‌-జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు కూడా పదవుల ఆశావహుల జాబితాలో ఉండడంతో ఎవరికి పదవులు ఇవ్వాలో తెలియక బీజేపీ సతమతమవుతోంది.పదవులు దక్కని నేతలను ఎలా బుజ్జగించాలి ఏం తాయిలాలు ఇవ్వాలనే విషయంపై బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.బీజేపీ విస్తరణకు తేదీ ఖరారయ్యేలోపు పదవులు దక్కని నేతలకు ఎటువంటి తాయిలాలు ప్రకటించి దారికి తెచ్చుకోవాలనే విషయంపై మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.ఇక మంత్రివర్గంలో తమ అనుంగ శిష్యులకు స్థానం దక్కించుకోవడానికి యడియూరప్ప తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.సుదీర్ఘ పాలనలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా తన మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలంటే మంత్రివర్గంలో శిష్యగణం ఉండాలని భావించి యడియూరప్ప జాబితాలో శిష్యులు,అనుంగలకు పెద్దపీట వేసినట్లు సమాచారం.ఈ క్రమంలో గాలి జనార్ధన్‌రెడ్డి ఆప్తుడు,తన అనుంగ శిష్యుడు రాములుకు ఇప్పుడు డిప్యూటీ సీఎం దక్కబోతుందన్న చర్చ కన్నడలో విస్తృతంగా సాగుతోంది.శ్రీరాములకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వెనుక యడియూరప్ప మరో ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.బీజేపీ పార్టీకి అన్ని వేళలా మద్దతు తెలుపుతూ వెన్నుదన్నుగా నిలిచే గాలి జనార్ధన్‌రెడ్డిని దృష్టిలో పెట్టుకొని శ్రీరాములుకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.దీంతోపాటు శ్రీరాములుకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా శ్రీరాములు సామాజిక వర్గానికి చెందిన నేతల నుంచి అసంతృప్తి ఎదురకాకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.కాగా బీజేపీలో సీనియర్‌ నేతలు,ముఖ్యనేతలు కూడా మంత్రి పదవుల కోసం తమ స్థాయిలో లాబీయింగ్‌లు చేస్తున్నట్లు సమాచారం.దీంతోపాటు ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదువుల రేసులో ఉండడంతో ఎవరికి పదవులు దక్కనున్నాయోనని బీజేపీ నేతలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బీజేపీ ఈ ప్రయత్నాల్లో నిమగ్నం కాగా కాంగ్రెస్‌లో ప్రతిపక్ష నేత స్థానం కోసం పోటీ నెలకొంది.మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు మాజీ మంత్రులు డీకే శివకుమార్‌,పరమేశ్వర్‌,ఆర్‌వీ దేశ్‌పాండె తదితర నేతలు ప్రతిపక్ష నేత స్థానం కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం.అయితే తాజాగా ప్రతిపక్ష స్థానానికి అనూహ్యంగా మాజీ స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ పేరు తెరపైకి వచ్చింది.కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించనుందా? అవుననే సమాధానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేపీసీసీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ సభ్యత్వాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తర్వాత పలు మార్లు బీజేపీని ఇరుకుపెట్టేలా రమేష్ కుమార్ ప్రసంగించారు. నేపథ్యంలోబీజేపీని ధీటుగా ఎదుర్కోవడం రమేశ్‌కు మాత్రమే సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం.రమేశ్‌ అయితేనే బీజేపీ కి మాటకి మాట ఎదురు చెప్పగలరని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలోని జేడీఎస్కాంగ్రెస్సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి మాజీ సీఎం సిద్ధరామయ్య ఒంటెద్దు పోకడలే కారణమని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్ఠానం పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సిద్ధరామయ్య సకాలంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్ది ఉంటే ఏకంగా 13మంది ఎమ్మెల్యేలు అసమ్మతిబాట పట్టి ఉండేవారు కాదని, ప్రభుత్వం కుప్పకూలే వాతావరణం నెలకొనేది కాదని ఎమ్మెల్యేలు వివరించినట్టు కథనం. ప్రతిపక్షనేతగా సిద్ధరామయ్యను నియమిస్తే మరింతమంది కాంగ్రెస్ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నట్టు తెలిసింది. మొత్తానికి సిద్ధరామయ్యకు ప్రతిపక్షనేత పదవి దక్కకుండా చూసేందుకు కాంగ్రెస్లోని వర్గం ప్రయత్నిస్తోంది.దీంతో కర్ణాటక రాజకీయాల్లో కొత్తగా పదవుల కోసం రాజకీయాలు మొదలయ్యాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos