పెరుగుతున్న పార్టీల ఎన్నికల వ్యయం

పెరుగుతున్న పార్టీల ఎన్నికల వ్యయం

న్యూ ఢిల్లీ : భారత్లో ఎన్నికల పండుగ మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇక మిగతా దశల్లో జరగబోయే ఎన్నికలకూ ప్రచారాలు, సభలు హౌరాహౌరీగానే జరుగుతున్నాయి. పార్టీలు, అభ్యర్థుల పోస్టర్లు, హౌర్డింగ్లు, బ్యానర్లు, కరపత్రాలు, ఊరేగింపులు, వీధి నాటకాలు, కుటుంబ సమావేశాలు, నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఓపెన్ జీప్ టూర్లు, ఇంటింటి ప్రచారాలు.. ఇలా ఒక పార్టీ ప్రచారంలో అనేకం ఉంటాయి. దీంతో అభ్యర్థులు చేసే ఖర్చు తీవ్రంగా పెరిగిపోతున్నది. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలు కూడా విపరీతమైన డబ్బులను ఖర్చు చేస్తూ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచార ఖర్చులు, అలాగే ఓటర్లకు నగదు, వస్తువుల రూపంలో అక్రమ ప్రోత్సాహకాలు విపరీతంగా పెరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు, ఎన్నికల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ సీఎంఎస్ ప్రకారం.. భారత్లో 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా నమోదైన అత్యంత ఖరీదైనవి. మొత్తం ఖర్చు దాదాపు రూ. 55,000-60,000 కోట్లు అని అంచనా. ఆ ఎన్నికల ప్రక్రియ దాదాపు 75 రోజులు కొనసాగింది. ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. అయితే, ఆ రికార్డును ప్రస్తుత ఎన్నికలు అధిగమిస్తుందనటంలో సందేహం లేదని విశ్లేషకులు అంటున్నారు. పోటీ తీవ్రత ఆధారంగా ఎన్నికల చివరి రోజుల్లో ఖర్చులు పెరుగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు.
కేరళలోని ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో 1,200 నుంచి 1,300 బూత్లు ఉన్నాయని ఆయన చెప్పారు. పార్టీల జిల్లా యూనిట్లు ప్రచార సామగ్రిని అందజేస్తాయి. లాజిస్టిక్స్, మానవశక్తి, రిఫ్రెష్మెంట్లు మొదలైన వాటిపై ఖర్చులను భరిస్తాయి. ”మేము ప్రతి అభ్యర్థికి ఒక లోక్సభ స్థానంలో ఒకే రౌండ్ కోసం 70,000 నుంచి 1,35,000 పోస్టర్లను అందించాలి. అది ఆరు లేదా ఏడు రౌండ్ల వరకు ఉండవచ్చు” అని ఆయన చెప్పారు. ”అదనంగా కుటుంబ సమావేశాలు ఉన్నాయి. మూడు, నాలుగు పార్టీ సభ్యుల బృందాలు ఓటర్ల ఇండ్లను సందర్శిస్తాయి. ఈ సభ్యులకు రోజువారీ భత్యం ఇవ్వాలి.ఈ రోజుల్లో డిజిటల్ ప్రచారాల కోసం భారీ మొత్తం ఖర్చు అవుతున్నది” అని సదరు నాయకుడు చెప్పాడు. ఇది ఎక్కువగా కేంద్ర నాయకత్వం, దానిని భరించగలిగే అభ్యర్థులతోనే ఉంటుందని తెలిపారు.
ఒక నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఖర్చు చేసే మొత్తం, సగటున ఎన్నికల కమిషన్(ఈసీ) సూచించిన రూ. 95 లక్షల కంటే 7-12 రెట్లు ఎక్కువగా ఉంటున్నదని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. కొంతమంది అభ్యర్థులు రూ. 50 కోట్ల వరకు కూడా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ చేసిన అధ్యయనం ప్రకారం.. రాజకీయ పార్టీలు తమ ఖర్చులను ప్రకటించే ప్రధాన వర్గాలు ప్రచారం, ప్రయాణం, ఇతరాలు, అభ్యర్థులపై చేసే ఖర్చు. 2004, 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో (కలిసి) జాతీయ పార్టీలు తమ మొత్తం ఖర్చులో 50.58 శాతం ప్రచారానికి, 19.68 శాతం ప్రయాణ ఖర్చులకు, 15.43 శాతం అభ్యర్థులకు, 14.31 శాతం ఇతరాలకు ఖర్చు చేశాయి. పదేండ్ల కాలంలో.. ప్రచార వ్యయం 641 శాతం, ప్రయాణం 802 శాతం, అభ్యర్థులపై ఖర్చు 416 శాతం పెరిగిందని అంచనా. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాన స్రవంతి పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు కనీసం రూ. 20 కోట్లు ఖర్చు చేస్తారనీ, ఈ మొత్తం పెరుగుతున్నట్టు కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకుడు ఎన్.ఎం పియర్సన్ చెప్పారు. ”రాజకీయంగా అవగాహన ఉన్న సమాజం డబ్బు శక్తి ప్రభావాన్ని అసహ్యించుకుంటున్నదని ఆయన చెప్పారు. అభ్యర్థుల రాజకీయ అభిప్రాయాల ఆధారంగా ఓటు వేస్తారని తెలిపారు. కాగా, పెరిగిపోత్ను ఎన్నికల వ్యయం ప్రజాస్వామ్య దేశానికి ఏ మాత్రమూ మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై కేవలం ఎన్నికల అధికారులే కాకుండా.. మీడియాతో పాటు ప్రతి ఓటరూ ఒక కన్నేసి ఉంచి బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos