రిషబ్ పరిపక్వత చెందుతున్నాడు

  • In Sports
  • January 14, 2019
  • 196 Views
రిషబ్ పరిపక్వత చెందుతున్నాడు

దిల్లీ: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ ఎదుగుతున్న క్రికెట్‌ విజేత అని బీసీసీఐ ప్రధాన సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. అతడు ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్నాడని పేర్కొన్నారు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ తర్వాత అతడికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

‘ఆస్ట్రేలియాలో రిషభ్‌ పంత్‌ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. ఎడతెరపి లేని ఆట అతడి శరీరంపై తీవ్ర ప్రభావం చూపింది. అతడికి కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరం. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ లయన్స్‌పై ఎన్ని మ్యాచ్‌లు ఆడగలడో చూస్తాం. పంత్‌ మా ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్నాడు. అతడో విజేతగా రూపొందుతున్నాడు. అతడి శక్తియుక్తులేంటో అతడికింకా పూర్తిగా తెలియదు. మ్యాచ్‌ పరిస్థితులను గౌరవించాలని రవి, కోహ్లీ అతడికి సూచించారు. వారిని పంత్‌ గౌరవించాడు. అవసరానికి తగినట్టు ఆడగలనని నిరూపించాడు. టెస్టులకు ఎంపిక చేసినప్పుడు అతడి కీపింగ్‌ ప్రతిభ గురించి అందరూ పెదవి విరిచారు. ఇంగ్లాండ్‌లో ఒక టెస్టులో 11 క్యాచ్‌ అందుకున్నప్పుడు, ఆస్ట్రేలియాలో రికార్డులు బద్దలు చేసినప్పుడు మా అంచనా నిజమైంది’ అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.

పంజాబ్ ‌యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలడని ప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో అతడు ఆడగలడన్నారు. న్యూజిలాండ్‌లో భారత్‌-ఏ ఓపెనర్‌గా అతడు విజయవంతం అయ్యాడని వెల్లడించారు. రాహుల్‌ ద్రవిడ్‌తో శుభ్‌మన్‌ అంతర్జాతీయ స్థాయికి సిద్ధంగా ఉన్నాడా లేదా అన్నది చర్చించామన్నారు. భారత్‌-ఏ పర్యటనలు యువకులను సానపెడుతున్నాయని అందుకు హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీషా, ఖలీల్‌ అహ్మద్‌ ఉదాహరణ అని పేర్కొన్నారు. కుల్‌దీప్‌, చాహల్‌ విషయంలోనూ ఇదే జరిగిందన్నారు. జస్ప్రీత్‌ బుమ్రాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. మహ్మద్‌ షమి ఫిట్‌నెస్‌ మెరుగైందని ప్రసాద్‌ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos