వర్మకు తాఖీదులు

హైదరాబాద్ : దిశ ఎన్కౌంటర్ చిత్రంపై వివరణ ఇవ్వాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు తాఖీదు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం పై నిర్మిస్తున్న ‘దిశ ఎన్కౌంటర్’ చిత్రం విడుదల కాకుండా నిలిపేయించాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు విన్నవించారు. ‘బాధిత కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్మ ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండన్వికుండా చేస్తున్నార’ని పిటిషినర్ తరపు న్యాయవాది కృష్ణ మూర్తి వివరించారు. ఈ చిత్రంలో నిందితుల్ని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దిశ సంఘటనపై జ్యుడిషినల్ కమిషన్ విచారణ జరుగుతున్నదశలో సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు. చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. దరిమిలా న్యాయస్థానం సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్కు తాఖీదుల్ని జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దిశ ఎన్కౌంటర్ చిత్రం ఈ నెల 26న విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుడు నవంబర్ 26న షాద్ నగర్ సమీపంలో జరిగిన సామూహిక హత్యాచారం ఆధారంగా తీసుకొని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను తెరకెక్కించారు. సంబంధిత ట్రైలర్ను ఇప్పటికే యూట్యూబ్లో విడుదల చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos