కరోనా : కేంద్రం కీలక ఆదేశాలు

కరోనా : కేంద్రం కీలక ఆదేశాలు

ఢిల్లీ : కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22 నుంచి వారంపాటు అంతర్జాతీయ, వాణిజ్య విమానాలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ సూచనలు పాటించాలని కోరింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలపై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ సహా ఉన్నతాధికారులు దిల్లీలో మీడియాతో మాట్లాడారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలను ఇంటి నుంచి బయటకు రానివ్వొద్దని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బందికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ గ్రూప్‌ బీ, సీ కేటగిరీల ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు రావాలని కేంద్రం సూచించినట్లు ఆయన చెప్పారు. వారానికొకసారి ఈ విధానాన్ని మార్చుకోవాలని.. బీ, సీ కేటగిరీ ఉద్యోగులు మినహా మిగిలిన ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేసేలా ఆయా విభాగాధిపతులు ఆదేశాలు జారీ చేయాలన్నారు. కార్యాలయానికి దగ్గరలో నివాసం ఉంటున్న అన్ని స్థాయిల ఉద్యోగులను గుర్తించి వారు ఎప్పుడంటే అప్పుడు కార్యాలయాలకు వచ్చేలా చూడాలని విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విధులకు హాజరయ్యే ఉద్యోగుల సమయాలను పలు విభాగాలుగా విభజించినట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు, ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పని సమయాలు నిర్దేశించినట్లు తెలిపారు. ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందన్నారు. అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వారు మినహా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సంస్థల ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసేలా కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. దివ్యాంగులు, విద్యార్థులు, రోగులు మినహా మిగిలిన అన్ని రాయితీ పాస్‌లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు రద్దు చేయాలని కేంద్రం సూచించిందన్నారు.  ఎటువంటి అత్యవసరం వచ్చినా వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన సూచనలను ఆర్థిక సర్వీసులు, ప్రభుత్వ రంగ సర్వీసుల ఉన్నతాధికారులు ఆయా విభాగాలకు ప్రత్యేకంగా జారీ చేయాలన్నారు. అయితే అత్యవసర సేవల విభాగాల్లో పని చేస్తున్నవారికి ఈ ఆదేశాలు వర్తించవని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని డీవోపీటీ అదనపు కార్యదర్శి సుజాతా చతుర్వేది వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos